వివాదాస్పద మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం.. మరి భారత్ ఇప్పుడేం చేస్తుందో?

- Advertisement -

న్యూఢిల్లీ: కొండను పొట్టేలు ఢీకొంటే ఏం జరుగుతుంది..? పొట్టేలు కొమ్ములే విరిగిపోతాయి.. ఈ విషయం నేపాల్‌కు తెలియనట్లుంది. అందుకే భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.

ఇటీవల భారత భూభాగాలను తనవిగా చూపిస్తూ నేపాల్ ఓ కొత్త మ్యాప్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది.

- Advertisement -

నేపాల్ ఈ మ్యాప్‌ను మొదటిసారిగా విడుదల చేసినప్పుడే దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఏకపక్షంగా తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను భారత్ సమర్థించదని కూడా ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ఈ మ్యాప్‌కు ఎంటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవని, దీనిని తాము పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. 

అయితే ఈ మాటలను ఏ మాత్రం పట్టించుకోని నేపాల్ ప్రభుత్వం శరవేగంగా ఆ మ్యాప్ ‌ఆమోదానికి పావులు కదిపింది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.

దీంతో ఏ అడ్డంకులూ లేకుండా కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ నేడు ఆమోద ముద్ర వేసింది. ఈ మ్యాప్ ప్రకారం భారత్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధూరా ప్రాంతాలు నేపాల్‌ భూభాగంలోనివని ఆ దేశ ప్రభుత్వం వాదన.

ప్రస్తుతం ఈ మ్యాప్‌ అక్కడి పార్లమెంట్ ఆమోదం కూడా పొందడంతో ఈ వాదనకు నేపాల్‌లో చట్టబద్ధత లభించినట్లయింది. మరి ఇప్పుడు ఈ మ్యాప్‌పై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -