భారత రైతులపై కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు.. ఒకరి మృతి

- Advertisement -

కరోనా లాక్‌డౌన్ కారణంగా భారత్ నుంచి ఎవరూ తమ దేశంలోకి రాకుండా నేపాల్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇది తెలియని కొందరు రైతులు ఎప్పటిలానే సరిహద్దు దాటడంతో వారిపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు.

- Advertisement -

ఈ కాల్పుల్లో ఓ రైతు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరికి బులెట్ గాయాలయ్యాయి.

సరిహద్దు దాటుతున్నాడన్న కారణంతో ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న పోలీసులపై మృతుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా నేపాల్‌, భారత్‌ మధ్య సరిహద్దు ఉన్నప్పటికీ అది నామమాత్రమే అన్న విషయం తెలిసిందే. 

దీంతో ఇటు ప్రజలు అటు, అటు ప్రజలు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో సరిహద్దు దాటుతున్న కొందరు రైతులపై నేపాల్ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఓ రైతు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేపాల్, బిహార్ మధ్యనున్న లాల్‌బండి-జానకీనగర్ సరిహద్దు వద్ద చోటుచేసుకుంది.

ఈ ప్రాంతం సీతామర్హి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను అదనపు డీజీపీ జితేంద్ర కుమార్ ధృవీకరించారు.

కాల్పులు జరిగిన ప్రాంతం నేపాల్ ఆధీనంలో ఉన్నట్లు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికేష్ కుమార్, ఉమేష్ రామ్, ఉదయ్ ఠాకూర్‌లు వారి పొలంలో సాగుచేసుకుంటున్నారు.

అదే సమయంలో సరిహద్దు దాటి వచ్చారంటూ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వికేష్ కుమార్(25) మరణించగా మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

వీరు మాత్రమే కాకుండా మరో ఇద్దరు రైతులకు కూడా స్వల్ప గాయాలు కాగా అందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

అయితే లంగన్ రాయ్ అనే మరో రైతును పోలీసులు బంధించి తీసుకెళ్ళినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

కాల్పులు జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా న్యాయమూర్తితో పాటు స్థానిక ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

ఇదిలా ఉంటే నేపాల్ పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వికేష్ కుమార్ రాయ్ తండ్రి నాగేశ్వర్ రాయ్ పలు వివరాలను వెల్లడించారు.

తన పొలం నేపాల్‌లోని నారాయణ్‌పూర్ ప్రాంతంలో ఉందని, అక్కడే తన కుమారుడు వ్యవసాయం చేసేందుకు వెళ్ళాడని తెలిపారు. 

వ్యవసాయం చేసుకునేందుకు వచ్చిన రైతులను కాల్చి చంపడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

అయితే మే 17వ తేదీన కూడా ఇలానే సరిహద్దు దాటబోతున్న కొందరు భారతీయులను నేపాల్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -