నీరవ్ మోడీకి ఈడీ షాక్: ఆన్‌లైన్‌లో 13 లగ్జరీ కార్ల వేలం, ఎప్పుడో తెలుసా?

5:19 pm, Mon, 1 April 19
Nirav Modi Latest News, luxury cars sold online News, Newsxpressonline

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు 13వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్స్(ఈడీ) మరో షాక్‌ ఇచ్చింది. నీరవ్‌కు చెందిన 13 కార్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అతడికి చెందిన విలాస వంతమైన పెయింటింగ్స్‌ ద్వారా రూ.54.84 కోట్లు సేకరించింది.

ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏప్రిల్‌ 18న నీరవ్‌కు చెందిన అత్యంత విలాస వంతమైన కార్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నారు. రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పనామెరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, మూడు హోండా కార్లు, టొయోటా ఫార్చునర్‌, ఒక ఇన్నోవా తదితర కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు వీటిలో ఉన్నాయి.

కార్లన్నీ సరైన స్థితిలోనే ఉండటంతో ఇవి మంచి ధర పలుకుతాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ వేలాన్ని నిర్వహించే కాంట్రాక్టును ప్రభుత్వం మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఎస్‌టీసీ)కు ఇచ్చింది. వేలంలో కార్లను కొనాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. కార్లు కొనాలనుకునే వారు కార్లను పరిశీలించవచ్చు.

కార్ల టెస్ట్ డ్రైవ్ కుదరదు..

అయితే, టెస్ట్‌ డ్రైవ్‌ చేయడానికి మాత్రం అనుమతించరు. వేలానికి ఒక వారం ముందుగా కొనుగోలుదారు కార్లను పరిశీలించుకునే వీలు కల్పించనున్నారు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్‌, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం కొంత గడువు ఇస్తారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్లకు మోసగించి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్‌ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇతడికి బెయిల్‌ కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈడీ కార్ల వేలమంటూ నీరవ్ మోడీకి మరో షాకిచ్చింది. స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ముమ్మర యత్నాలు చేస్తున్నాయి.

చదవండి: పుల్వామా ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం