ఉరే సరి! ‘నిర్భయ’ కేసులో రాష్ట్రపతి కీలక నిర్ణయం, దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ…

- Advertisement -

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరికి మార్గం సుగమం అయింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముకేశ్‌సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు.

హోంశాఖ నేడు ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. పరిశీలించిన రాష్ట్ర‌ప‌తి ముకేశ్ సింగ్ పెట్టుకున్న అర్జీని తిరస్కరించినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

దోషి ముకేశ్ పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించినప్పటికీ ఉరికి కనీసం రెండు వారాల గడువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నెల 22న వారికి ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు తెలిపారు.

అంటే ఈ నెలాఖరులో కానీ, లేదంటే ఫిబ్రవరి తొలి వారంలోనే కానీ వారికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 16 డిసెంబర్ 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు.

బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా గుర్తించగా, వారిలో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

మరొకడు మైనర్ కావడంతో జువెనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యాడు. మిగతా నలుగురూ పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌‌లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

- Advertisement -