కరోనా రోగులకు బెడ్లు లేవు.. తేల్చి చెప్పిన ముంబై వైద్యులు

7:55 pm, Sun, 14 June 20

ముంబైలో పెరుగుతున్న కరోనా బాధితులకు ఇకపై వైద్యం అందడం కష్టంగా మారనుందా.? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా మొత్తం 3లక్షల కరోనా కేసులు ఉంటే అందులో 30 శాతానికి పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. 

మహారాష్ట్రలో మొత్తం లక్షకేసులకు పైగా కరోనా కేసులు ఉంటే అందులో సగానికి పైగా రాజధాని ముంబైలోనే ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు కరోనా మహమ్మారికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే. ముంబైలో ఇఫ్పటికే 55వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ముంబైలో కరోనా కేసులు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే పెరిగే కేసులకు సరిపడా వైద్య సదుపాయాలు మాత్రం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొత్తగా కరోనా బారిన పడుతున్నవారికి వైద్యం అందించడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

దాదాపు ముంబైలోని అన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు నిండిపోయాయని, ఇకపై వచ్చే రోగులకు ఎక్కడ చికిత్స అందించాలో తెలియండం లేదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నగరంలోని ఆసుపత్రుల్లో 99 శాతం ఐసీయూ బెడ్లు, 94 శాతం వెంటిలేటర్లను కరోనా రోగుల చికిత్స కోసమే వినియోగిస్తున్నట్లు ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) స్వయంగా వెల్లడించింది.

ఈ నెల 11 నాటికి నగరంలోని మొత్తం 1,181 ఐసీయూ పడకల్లో 1,167 పడకలను కరోనా తీవ్రమైన వారి కోసం వినియోగిస్తున్నామని, మిగిలిన 14 పడకలూ శనివారం రాత్రికే నిండిపోవచ్చని అధికారులు వెల్లడించారు.

వెంటిలేటర్ల విషయానికి వస్తే, అందుబాటులో ఉన్న 530 వెంటిలేటర్లలలో 497 రోగులకు అమర్చామని, 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

కరోనా సోకిన సాధారణ రోగుల కోసం 10,450 పడకలు అందుబాటులో ఉండగా, 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయని అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కొత్తగా గుర్తించిన కరోనా బాధితులకు బెడ్లు, ఐసీయూలు, వెంటిలేటర్లు అందుబాటులో లేకపోతే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో వాటి సంఖ్యను పెంచుతామని తెలిపారు.