ఒడిశా హైకోర్టు సంచలనం: పెళ్లికి ముందు వివాహేతర సంబంధం.. అత్యాచారం కాదు

2:21 am, Mon, 25 May 20

కటక్: పెళ్లి చేసుకుంటానంటూ పురుషుడు ప్రలోభానికి గురిచేసి మహిళతో వివాహేతర సంబంధం నెరపడం అత్యాచారం కింద పరిగణించరాదంటూ ఒడిశా హైకోర్టు శనివారం అభిప్రాయపడింది. 

ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జస్టిస్ ఎస్.కె.పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

2019లో పొట్టంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ యువకుడు తనతో శారీరక సంబంధం పెట్టుకుని.. తరువాత పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ కేసులో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. శనివారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

పెళ్లి చేసుకుంటామనే భావనతో కొంతమంది యధేచ్ఛగా శారీరక సంపర్కం పెట్టుకుంటున్నారని, ఆ తరువాత పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని ధర్మాసనం అంది.

ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, పొట్టంగి కేసులో యువకుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.