‘‘వీవీప్యాట్‌ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందే, సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేస్తాం..’’

4:13 pm, Sun, 14 April 19
Opposition-Parties-Meeting-In-Constitutional-Club-of-Delhi

న్యూఢిల్లీ: ఎన్నికలు ముగిశాయి కనుక.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి.. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈవీఎంలలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతినే అనుసరిస్తున్నాయని పేర్కొన్నాయి.

ప్రజస్వామ్య పరిరక్షణ, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణపై ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆదివారం విపక్షాల నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నేతలు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ తదితరులు సమావేశమై చర్చించారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు.

నా పోరాటం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం: చంద్రబాబు

తన పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆర్నెల్లకే పాత సెల్‌ఫోన్ పడేసి కొత్తది వినియోగిస్తున్న ఈ రోజుల్లోనూ మనం ఏళ్ల తరబడి వాడుతున్న ఈవీఎంలనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని, ఈ సాంకేతికతను తెలంగాణలో దుర్వినియోగపరిచారని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. 25 లక్షల వ్యతిరేక ఓట్లను ఆ రాష్ట్రంలో తొలగించారని, దీనిపై ఎన్నికల అనంతరం సంబంధిత అధికారులు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు.

తెల్లవారుజామున 4 గంటల వరకు పోలింగా?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో ఈనెల 11న ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ మర్నాడు తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగిందని పేర్కొంటూ.. అసలు ప్రజాస్వామ్యంలో పోలింగ్ జరిపే తీరు ఇదేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

11వ తేదీన చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పోలింగ్ మొదలేకాలేదని, ఈవీఎంల నిర్వహణకు సాంకేతికత సరిగా తెలియని కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించారని తెలిపారు.

మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు కూడా 7 సెకన్లు ఉండాల్సింది.. 3 సెకన్లే ఉన్నాయని, మరి ఇదెలా జరిగిందని ప్రశ్నిస్తే ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేకపోయిందని చంద్రబాబు అన్నారు.

సుప్రీంలో రివ్యూ పిటిషన వేస్తాం…

బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి.. వీవీ ప్యాట్‌ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఈ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించామని, అయితే ఈ తరహా లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం అఫిడవిట్‌ దాఖలు చేసిందని, కానీ అది నిజం కాదని, దీనిపై మళ్లీ తాము రివ్యూ పిటిషన్‌ వేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఈసీకి అభ్యంతరమెందుకు?: అభిషేక్‌ సింఘ్వీ, కపిల్ సిబల్‌

కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. 6 జాతీయ పార్టీలు, 15 ప్రాంతీయ పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయని తెలిపారు. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓట్లు ఎలా తొలగిస్తున్నారని ప్రశ్నించారు.

‘‘మాకు యంత్రాలపై విశ్వాసం లేదు. అవెలా దుర్వినియోగం అవుతాయో మేం చూపిస్తాం. మాకు పేపర్ బ్యాలెట్‌పైనే విశ్వాసం. ఓటరు ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేస్తారో అది వారికే చెందాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంల ద్వారా అలా జరగడం లేదు. అందుకే వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలని మేం కోరుతున్నాం.. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏమిటి అభ్యంతరం?’’ అని వారు ప్రశ్నించారు.