ఘోర ప్రమాదం: జనం పైనుంచి దూసుకెళ్లిన రైలు.. 50 మంది కిపైగా మృతి

amritsar-train-acident
- Advertisement -

train-acident-amritsar

అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలో రైలు పట్టాలకు సమీపంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

- Advertisement -

పలువురు రైలు పట్టాలపై కూడా నిలుచుని రావణ దహనం కార్యక్రమాన్ని తిలకిస్తుండగా అదే సమయంలో పఠాన్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళుతున్న రైలు అటుగా వచ్చింది. రావణ దహనాన్ని తిలకిస్తున్న ప్రజలు రైలు రావడాన్ని ఏమాత్రం గమనించలేదు.  పైగా టాపాసుల ధ్వనుల నడుమ రైలు  వస్తోన్న శబ్దం కూడా వినబడలేదు.  దీంతో పెను ప్రమాదం జరిగింది.

రైలు పట్టాలపై నిలబడి ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారిపైనుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు.  ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జనం పైనుంచి దూసుకెళ్లిన రైలు…

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు పట్టాలపై 500-700 మంది వరకు ఉన్నట్లు సమాచారం.   రైలు పట్టాలన్న స్పృహ  కూడా లేకుండా..  అందరూ రావణ దహనం కార్యక్రమంలో మునిగిపోయి.. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన రైలు వారి పైనుంచి దూసుకెళ్లింది.

దీంతో  ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది.  ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.  ఎంతో ఆనందంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అనుకోని విషాదం చోటుచేసుకుని అక్కడి పరిస్థితిని భీతావహంగా మార్చింది.

టపాసుల శబ్దంలో కలిసిపోయి…

జోడా ఫఠక్… అమృత్‌సర్‌లోని చౌరా బజార్ ప్రాంతంలో  ఉంది. రావణ దహనం సందర్భంగా కాల్చే టపాసుల మోతలో రైలు వస్తోన్న ధ్వని కూడా కలిసిపోవడంతో.. రైలును ప్రజలు గమనించలేకపోయినట్లు తెలుస్తోంది.

భారీ శబ్దంతో  టపాసులు పేలుతుండటం, సరిగ్గా అదే సమయంలో రైలు రావడం వరుసగా జరిగిపోయాయి.  ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 50కి పైగా ఉంటుందని తొలుత భావించినప్పటికీ.. మృతుల సంఖ్య 100కు పెరిగే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం.

పోలీసులు ఏమన్నారంటే?

ఈ ఘోర రైలు ప్రమాదంపై శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో పంజాబ్ పోలీసులు మాట్లాడారు. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్నామని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.

ప్రత్యక్ష సాక్షులు ఇలా…

ఈ ప్రమాద ఘటనకు అడ్మినిస్ట్రేషన్, దసరా కమిటీ బాధ్యులు అని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒకవేళ రైలు  వచ్చినా.. మెల్లగా వస్తుంది, లేదా అక్కడికి వచ్చాక రైలు ఆగుతుందని చెప్పారని, కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగిందని తెలిపారు.  కనీసం రైలు వస్తున్న సమయంలో కమిటీ సభ్యులు ప్రజలను అప్రమత్తం చేసినా బాగుండేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -