ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…

5:37 pm, Tue, 26 February 19
pak-prime-minister-imran-khan, newsxpress.online

imran-khan-modi-xi-xinping, newsxpress.online

న్యూఢిల్లీ: భారత్ వైమానిక దాడులపై ప్రతిదాడికి సిద్ధమైన పాకిస్తాన్ మళ్లీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిరేజ్ 2000 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించి ఆ స్థావరాలను సర్వనాశనం చేసిన సంగతి విదితమే.

ఈ సందర్భంగా భారత వైమానిక దళం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనే కాకుండా, పాకిస్తాన్ భూభాగంలో కూడా సర్జికల్ స్ట్రయిక్ చేసింది.

భారత వైమానిక దళానికి చెందిన పన్నెండు మిరేజ్ 2000 జెట్ ఫైటర్లు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. 1000 కిలోల బాంబులతో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉన్న ఖైబర్ ఫక్తూంక్వాలోని మన్సెహ్రా జిల్లా బాలాకోట్ వరకు మన యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి మరీ దాడులు జరిపాయి. మరోవైపు భారత వైమానిక దాడులను పాకిస్తాన్ కూడా ధ్రువీకరించింది.

మరోవైపు తమ ప్రధాన భూభాగంలోకి కూడా భారత యుద్ధ విమానాలు ప్రవేశించాయన్న సంగతిని గ్రహించిన పాకిస్తాన్ ప్రతిదాడికి వ్యూహ రచన చేసింది. మన మిరేజ్-2000 విమానాలను ప్రతిఘటించేందుకు ఆ దేశానికి చెందిన ఎఫ్-16 విమానాలు సిద్ధమయ్యాయి.

అయితే, ఒకేసారి మన 12 విమానాలు దాడికి పాల్పడడం, పైగా అవి వ్యూహాత్మకంగా ప్రయాణిస్తుండడం.. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వెనక్కి తగ్గింది. భారత వాయుసేన ఎంత పక్కా ప్రణాళికతో మంగళవారం నాటి దాడులు జరిపిందో చెప్పడానికి.. ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ చూస్తూ ఉండిపోవడమే నిదర్శనం.

చైనా శరణుజొచ్చిన పాకిస్తాన్!

మరోవైపు భారత వైమానిక దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ సాయం కోసం వెంటనే చైనాను సంప్రదించినట్లు సమాచారం. భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు మెరుపు దాడి జరిపి వెనక్కి వెళ్లిపోయిన వెంటనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ… చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ స్వయంగా వెల్లడించింది.

భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి పాక్ భూభాగంలోని ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని చైనాకు ఫిర్యాదు చేసిన పాక్ విదేశాంగ మంత్రి, తిరిగి తాము ప్రతి దాడులు చేయాలని భావిస్తున్నామని, ఇందుకు సహకరించాలని కోరగా, చైనా అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.

అయితే భారత వైమానిక దాడులకు సంబంధించి పాకిస్తాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వెర్షన్ మరోలా ఉంది. భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేశాయంటూ మంగళవారం ఉదయం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం గమనార్హం.