లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…

6:08 pm, Tue, 26 February 19
Flag_of_Pakistan

Flag_of_Pakistan

న్యూఢిల్లీ: ఉరి ఘటనకు ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 29న భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్‌తో తమకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించిన పాకిస్థాన్ తాజాగా మరోసారి అలాంటి ప్రకటనే చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన చేసిన దాడిని ధృవీకరిస్తూనే.. ఖాళీ ప్రదేశంలో భారత యుద్ధ విమానాలు బాంబులు వేసి వెళ్లిపోయాయని పాక్ ఆర్మీ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

భారత్ దాడి చేసిన ప్రతిసారీ తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ ఎందుకు చెబుతోంది? ఎందుకంటే.. పాక్ చాలా వీక్ కనుక. నిజానికి రెండు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధం జరిగితే తట్టుకునే శక్తి పాకిస్థాన్‌కు లేదు. ఎందుకంటే ఆ దేశ ఆర్మీ, వైమానికదళం, నౌకాదళం బలహీనంగా ఉన్నాయి. పాక్ రక్షణశాఖకు భారీగా నిధుల కొరత ఉంది. దీనికి తోడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఆర్థిక సాయం కోసమేనా..

ఆర్థిక సాయం కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేక దేశాల్లో తిరుగుతున్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ముద్ర పడడంతో సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు రావడం లేదు.
ఇలాంటి పరిస్థితిలో పాకిస్థాన్‌ గనక భారత్‌పై యుద్ధానికి దిగితే ఆర్థికంగా మరింత నష్టపోతుందని కూడా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే భారత్ దాడులు చేసే ప్రతిసారీ తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.

అంతేకాకుండా తమ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ప్రతిసారీ బెదిరింపులకు పాల్పడుతోందని చెబుతున్నారు. గతంలో సర్జికల్‌ దాడులు జరిపినప్పుడు అలాంటివేమీ జరగలేదని తన ప్రజలకు చెప్పుకొనే ప్రయత్నం చేసిందే తప్ప, పాకిస్థాన్ కనీస ప్రతిదాడి చేయలేకపోయిందని వారు గుర్తుచేస్తున్నారు.