కరోనా చికిత్సకు ‘పతంజలి’ ఆయుర్వేద మందు.. వారం రోజుల్లో అందుబాటులోకి…

Patanjali Launched Ayurvedic Medicine for Covid19 Cure
- Advertisement -

హరిద్వార్: యావత్ ప్రపంచానికే పెను సవాలు విసిరిన కరోనా వైరస్ చికిత్స కోసం ‘కొరోనిల్’ పేరుతో ఆయుర్వేద మందు(టాబ్లెట్లు)ను తయారు చేసినట్లు పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు.

మంగళవారం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కర్యక్రమంలో ఆయన ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుర్వేదంతోనూ కరోనాకు చికిత్స చేయవచ్చన్నారు.

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ విపత్కర సమయంలో దీనికి విరుగుడు మందు తీసుకురావడం చాలా ముఖ్యమని, తమ శాస్త్రవేత్తలు దీనిని సాధించగలిగారని వ్యాఖ్యానించారు.

ఈ మందు ఇచ్చి పరిశీలించగా.. మూడు రోజుల్లో 69 శాతం మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని, అలాగే 7 రోజుల్లో కరోనా రోగులు 100 శాతం కోలుకున్నారని వివరించారు.

‘కొరోనిల్’ మందు ద్వారా 14 రోజుల్లో కరోనాను పూర్తిగా నయం చేయవచ్చని, అయితే ఈ మందు ప్రస్తుతం దేశంలో అన్ని చోట్లా లభ్యం కాదని, మరో వారం రోజుల్లో పతంజలి స్టోర్స్‌లో మాత్రమే లభిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు.

పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఆయుర్వేద మందుతో అరికడతామని తాము గతంలోనే చెప్పామని, ఆ ప్రకారమే ‘కొరోనిల్’ను తీసుకొచ్చామని అన్నారు. 

ఈ మందు 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్19ను నయం చేస్తుందని ఆయన చెప్పారు. కొరోనిల్ కిట్ ధరను రూ.545గా నిర్ణయించామని, ఒక్క డబ్బాలోని టాబ్లెట్లు 30 రోజులకు సరిపోతాయని బాలకృష్ణ వివరించారు.

- Advertisement -