నేనూ కాపలాదారుడినే: ఎన్నికల్లో మోడీ సరికొత్త నినాదం, వీడియో రిలీజ్

2:57 pm, Sat, 16 March 19
PM Modi Launches 'Main Bhi Chowkidar' Campaign to Blunt Rahul Gandhi's 'Chowkidar Chor Hai' Jibe, Newsxpressonline

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమీపిస్లున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సోషల్‌మీడియాలో వినూత్నంగా ప్రారంభించారు. ప్రధాని మోడీని.. చౌకీ దార్ చోర్ హై(కాపలా దారుడే దొంగ) అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా మోడీ శనివారం ‘మై బీ చౌకీదార్’(నేనూ కాపలాదారుడినే) అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

సామాజిక దుష్టశక్తులు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి వాచ్‌మన్ లేదా కాపాలదారుడని మోడీ వివరించారు. తనను తాను కాపలాదారుడిగా అభివర్ణించుకున్న మోడీ… మీ కాపలాదారుడు నిబద్ధతతో నిలబడ్డాడు అని స్పష్టం చేశారు.

మై భీ చౌకీదార్…

దేశానికి సేవచేస్తున్నాడు. నేను ఒంటరిని కాదు. భారత్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చౌకీదార్‌లే. ఇవాళ ప్రతి భారతీయుడు మై బీ చౌకీదార్ అని చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

గత సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోడీని ఉద్దేశించి చాయ్‌వాలా అంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలనే బీజేపీ తన ప్రచార అస్త్రంగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈసారి అస్త్రాన్నే(మై భీ చౌకిదార్) ఎంపిక చేసుకున్నారు.

అనేక సర్వేలు, విశ్లేషణలు అనంతరం ‘మై భీ చౌకీదార్’ను ఎన్నికల నినాదంగా బీజేపీ ఎంచుకుంది. ఇటీవల రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీని పాత్రధారునిగా పేర్కొంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కాపలాదారే దొంగ అని అనేక సందర్భాల్లో ఆరోపణలు గుప్పించడంతో దీన్నే బీజేపీ ఎన్నికల నినాదంగా ఎత్తుకుంటోంది.

బీజేపీ నిర్వహించిన సర్వేల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా చౌకీదార్ చోర్‌ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వెల్లడయ్యింది. దీంతో బీజేపీ మరోసారి దీన్ని తనకు అనుకూలంగా మలచుకోనుంది. అంతేగాక, ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని అనేక సర్వేల్లో స్పష్టమైంది.