కాశ్మీరీలపై దాడుల చేస్తే కఠిన చర్యలు, పాక్‌కు వంతపాడతారా?: విపక్షాలపై మోడీ ఫైర్

- Advertisement -

న్యూఢిల్లీ: కాశ్మీరీలు మనవాళ్లేనని, కాశ్మీరీ సోదరులపై దాడులు చేసిన వాళ్లు వెర్రివాళ్లేనని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీరీలపై దాడులు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఆయన తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి, ఘాజియాబాద్‌ సహా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత సాయుధ దళాలు ధీరోదాత్తతను ప్రదర్శిస్తే, ప్రతిపక్షాల వారు తక్కువచేసి మాట్లాడుతున్నారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడులకు ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో తేల్చి చెప్పమంటున్నారు. తద్వారా పాకిస్థాన్‌ను వారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు’ అని విపక్షాలపై మోడీ మండిపడ్డారు.

అంతేగాక, ‘పాక్‌ చేసిన పనికి ఎవరైనా ఆ దేశాన్ని పొగుడుతారా? చప్పట్లు కొడతారా? కానీ కొంతమంది విపక్ష నేతలు పది రోజులుగా అదేపనిలో తరిస్తున్నారు. వారికి దేశంతో పనిలేదు. దేశం ఏమైపోయినా వారికి అక్కర్లేదు. ఎక్కడ కటకటాల వెనక్కి వెళ్తామోనన్న భయంతోనే కేంద్రంలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని వారు తహతహలాడుతున్నారు’ అంటూ ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శించారు.

‘కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ‘మహాకల్తీ’ కూటమి ఉపయోగిస్తున్న భాష… శత్రు దేశాలకు బలం చేకూర్చుతోంది. ఉగ్రవాదంపైనా, అవినీతిపైనా, పేదరికంపైనా పోరాడుతున్నందుకే నేనంటే వారికి గిట్టదు’ అని మోడీ విరుచుకుపడ్డారు.

కాశ్మీరీలపై దాడులు వెర్రివాళ్ల పని, కఠిన చర్యలు తప్పవు

కాన్పూర్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం పనులను ప్రారంభించిన మోడీ.. అనంతరం అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లక్నోలో 23 కిలోమీటర్ల పొడవైన నార్త్‌-సౌత్‌ కారిడార్‌లో రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన పలు గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు.

ఘాజియాబాద్‌లో రూ.32,500 కోట్ల విలువైన పనులకు మోడీ శంకుస్థాపనలు చేశారు. వీటిలో ప్రాంతీయ రైలు రవాణా వ్యవస్థ (ఆర్‌ఆర్‌టీఎస్‌) కింద ఘాజియాబాద్‌ మీదుగా ఢిల్లీ-మీరట్‌లను కలిపే మార్గం పనులున్నాయి. దిల్షద్‌ గార్డెన్‌-దిల్లీ న్యూ బస్సు అడ్డాలను కలుపుతూ నిర్మించిన రెడ్‌లైన్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. తర్వాత షాహీద్‌ స్థల్‌(న్యూబస్‌ అడ్డా) స్టేషన్‌లో ఎక్కి కాశ్మీరీ గేట్‌ స్టేషన్‌ వరకూ ప్రయాణించారు. భారత వాయుసేనకు చెందిన హిండన్‌ విమానాశ్రయంలో పౌరులు రాకపోకలు సాగించడానికి వీలుగా కొత్త ఎన్‌క్లేవ్‌ను ఆయన ఆరంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ-‘మన కాశ్మీరీ సోదరులపై వెర్రివాళ్లు దాడులు చేసినప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంది. అలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. దేశంలో ఐక్యతా వాతావరణాన్ని కాపాడటం ఎంతో ముఖ్యం’ అని స్పష్టం చేశారు.

కాపలాదారు మెళకువగానే ఉన్నాడు..

‘ఈ దేశ కాపలాదారు మెలకువగానే ఉన్నాడు. పుల్వామాలో 40 మంది సైనికుల్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటే… 2008 ముంబైయి దాడులప్పటి ప్రభుత్వంలాగే నేను కూడా మౌనంగా చూస్తూ కోర్చోవాలా? అందుకేనా నన్ను ప్రజలు ఎన్నుకొంది? పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడూ కోరుకోలేదా? వారి అభీష్టం మేరకు నేను నడుచుకోవద్దా? ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచేయొద్దా? మీ అందరి ఆశీస్సులతో నేనాపని చేయొద్దా?’’ అని మోడీ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న మోడీ.. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ సుందరీకరణ, రహదారి ప్రాజెక్టు పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ఎస్పీ, యూపీఏ ప్రభుత్వాలపై మోడీ విమర్శలు గుప్పించారు.

‘మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మూడేళ్లు ఇక్కడి సమాజ్‌వాదీ (ఎస్పీ) సర్కారు మాకు సహకరించలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. లేకుంటే ఈరోజు శంకుస్థాపనకు బదులు ప్రారంభోత్సవం చేసుకునేవాళ్లం. 70 ఏళ్లలో పాలకులంతా తమ స్వార్థం చూసుకున్నారు తప్పితే… శివుడిని పట్టించుకోలేదు. కాశీనాథుడున్న ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నది నా చిరకాల స్వప్నం’ అని మోడీ తెలిపారు.

ఇక వారణాసిలో ‘జాతీయ మహిళా జీవన సదస్సు-2019’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళారుల బెడదను, అవినీతిని రూపుమాపి ప్రతి పైసానూ ప్రజల కోసం ఖర్చు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.

చదవండి: రోస్టర్ ఆధారిత రిజర్వేషన్లు: మోడీ చివరి కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..
- Advertisement -