న్యూఢిల్లీ: దేశ మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం అలముకొంది. ప్రణబ్ అందించిన సేవలను స్మరించుకునేందుకు దేశంలో ఏడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రణబ్ మరణంతో సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేశారు.
మరోవైపు ప్రణబ్ ముఖర్జీకి సైనిక గౌరవ వందనంతో, అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రక్షణ శాఖ చేస్తోంది.
ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అస్వస్థతకు గురై ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు.
ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. మరోవైపు ఆయన కరోనా బారిన పడినట్లు కూడా వైద్యులు గుర్తించారు.
అప్పట్నించి దాదాపు 21 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ చివరికి పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.