పోలీసులు కొట్టడం వల్లే ఉగ్రవాదిగా మారాడు, కానీ..: సూయిసైడ్ బాంబర్ అదిల్ తల్లిదండ్రులు

Suicide-Bomber-Adil-Ahmad-Dar
- Advertisement -

శ్రీనగర్: రాళ్లు రువ్వారనే కారణంతో పోలీసులు తన కుమారుడ్ని కొట్టడం వల్లే అతను ఉగ్రవాదిగా మారాడని పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు వాపోయారు. అయితే, ఉగ్రదాడికి పాల్పడి ఇంతమంది ప్రాణాలు తీస్తాడని తాము అనుకోలేదని చెప్పారు.

‘‘నా కొడుకును పోలీసులు దారుణంగా కొట్టారు. ముక్కు నేలకు రాయించారు. అప్పటి నుంచి పోలీసులపై కోపం పెంచుకున్నాడు. ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు. కానీ, ఇలాంటి పని చేస్తాడనుకోలేదు..’’ అని 40 మంది జవాన్ల ప్రాణాలను బలి తీసుకున్న అదిల్‌ అహ్మద్‌ దర్‌ తల్లిదండ్రులు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అదిల్‌ తల్లిదండ్రులను మీడియా ప్రశ్నించగా వారు ఈ మేరకు స్పందించారు.

‘‘ఇంతమంది ప్రాణాలు తీస్తాడనుకోలేదు..’’

‘‘మూడేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. పోలీసులపైకి రాళ్లు విసిరాడన్న కారణంగా అప్పుడే స్కూల్‌ నుంచి వచ్చిన అదిల్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయించారు. అలా ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. దీన్ని అదిల్‌ అవమానంగా భావించాడు. పోలీసులు నన్ను ఎందుకు కొట్టారంటూ పదే పదే దాన్నే గుర్తుచేసుకునేవాడు. ఆ ఘటనతో పోలీసులపై అదిల్ కోపం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు’ అని అదిల్‌ తండ్రి గులామ్‌ హసన్‌ దర్‌ తెలిపారు.

అయితే, ఉగ్రవాదం వైపు వెళ్లద్దని తాము ఎంత చెప్పినా అదిల్ వినిపించుకోలేదని చెప్పారు. కానీ, ఇంత మంది ప్రాణాలు తీస్తాడని అనుకోలేదని అన్నారు.

కాగా, ఇరవై ఏళ్ల అదిల్‌ చదువును మధ్యలోనే ఆపేసి గతేడాది జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. దాడి జరగడానికి కొద్ది నెలల ముందు పుల్వామాకు 10 కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్నాడు. అక్కడ జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల ఆధ్వర్యంలో ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ తీసుకున్నాడు.

గురువారం పుల్వామా ప్రాంతంలో భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కాన్వాయ్‌లో వెళ్తారని ముందుగా తెలుసుకున్న అదిల్ పేలుడు పదార్థాలున్న కారుతో వెళ్లి కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో 44మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.

చదవండి: ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్

 

- Advertisement -