ఎన్నటికీ పీఎం కాలేరు: రాహుల్‌పై మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

1:12 pm, Sat, 6 April 19
maneka-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేరని తేల్చి చెప్పారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. పలువురు నేతల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయిందని అన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని మేనకా గాంధీ ఆరోపించారు. సుల్తాన్‌పూర్ టికెట్ రూ.15 కోట్లకు మాయావతి అమ్ముకున్నారని అన్నారు.

2014 కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు..

ఇది ఇలావుంటే, బీజేపీ పరిస్థితి దేశంలో రోజు రోజుకూ మరింత మెరుగుపడుతోందని చెప్పారు.
2014 ఎన్నికలకంటే కూడా అధిక స్థానాలను ఈ సారి ఎన్నికల్లో గెలుస్తామని మేనకా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

వరుణ్ గాంధీ ఎన్నికల్లో చాలా సులువుగా విజయం సాధించగలరని మేనకా గాంధీ చెప్పారు. ఫిలిబిత్‌లో బీజేపీ చేసిన అభివృద్ధే వరుణ్ గాంధీని గెలుపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, అమేథీలో తనను పార్టీ ప్రచారం చేయమని అడగలేదని, ఒకవేళ కోరితే తాను అక్కడ కూడా ప్రచారం చేస్తానని తెలిపారు మేనకా గాంధీ.

చదవండి: డాక్టర్.. ఈ కోడిపిల్లను బతికించండి: బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా! ప్రశంసా పత్రంతో…