పేదలకు కనీస ఆదాయం: రాహుల్ మెగా ఎన్నికల హామీ

rahul
- Advertisement -

rahul

రాయ్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో కీలక హామీని ముందుకు తీసుకొచ్చాడు. ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని రాహుల్‌ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్‌ అందుకున్నట్లైంది.

ప్రధాని మోడీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్‌ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రైతుల ర్యాలీలో సోమవారం రాహుల్‌ మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్‌ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్‌ అన్నారు.

దేశమంతటా అమలు చేస్తాం: రాహుల్

తాము చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తామని రాహుల్ చెప్పారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్‌ కుంభకోణం, అనీల్‌ అంబానీ, నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్‌ ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని వ్యాఖ్యానించింది.

- Advertisement -