ఎవరికి మద్దతిస్తారో?: లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఎంఎన్ఎస్

3:58 pm, Mon, 18 March 19
Raj Thackeray's MNS out of Lok Sabha poll fray in Maharashtra, Newsxpressonline

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు శిరీష్ సావంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎవరికి మద్దతిస్తారో..

కాగా, గత కొంతకాలంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో రాజ్ థాక్రే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీకి మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో ఎంఎన్ఎస్ చేరనుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

కానీ, కాంగ్రెస్ అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రాజ్ థాక్రే కలవడం మూలంగా ఉత్తర భారత్‌లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజ్ థాక్రే ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

2009లో 13 శాసనసభ స్థానాలు గెలుచుకున్న ఎంఎన్ఎస్.. 2014లో ఒక్క సీటుకే పరిమితి కావడం గమనార్హం. ఆ తర్వాత కూడా ఆ పార్టీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. కాగా, గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచిన రాజ్ థాక్రే.. కొంత కాలంగా బీజేపీ, మోడీ సహా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన కూటమిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.