రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ: లోన్ ఈఎంఐలు తగ్గే అవకాశం

5:11 pm, Thu, 4 April 19
RBI Latest News, Repo rate Latest News, Newsxpressonline

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగానే కీలక పాలసీ రేట్లను తగ్గించింది. శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ గురువారం రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది.

మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో బ్యాంకులకు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. కాగా, రివర్స్‌ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది. ఎంఎస్‌ఎఫ్‌ రేటు, బ్యాంక్‌ రేటు 6.25 శాతానికి చేరింది.

మందగించిన ప్రపంచ ఆర్తిక వ్యవస్థ

కాగా, ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది. వృద్ధి రేటును కొనసాగిస్తూనే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 4శాతం (-/+2)వద్ద కట్టడి చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ సమావేశం నాటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఆర్‌బీఐ భావించింది.

అమెరికాలో కూడా చివరి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు కనిపించలేదని అభిప్రాయపడింది. యూరో కూడా మందగించినట్లు పేర్కొంది. బ్రెగ్జిట్‌ కారణంగా యూకే వృద్ధిరేటు తగ్గిందని వెల్లడించింది.