Home వార్తలు జాతీయం ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న హోటల్లో దోశ…

ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న హోటల్లో దోశ…

0
ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న హోటల్లో దోశ…

న్యూఢిల్లీ: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇప్పుడిక ‘ఫ్రీ బర్డ్’ అయిపోయారు. దీంతో ఆయన ఓ సాధారణ పౌరుడి మాదిరిగా జీవిస్తున్నారు. మొన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వెళ్లి నలుగురితోపాటు కూర్చుని పాప్‌కార్న్ తింటూ సినిమా చూశారు. నిన్న బీహార్ రాజధాని నగరం పాట్నాలోని ఓ రెస్టారెంట్‌లో అందరి మధ్యన కూర్చుని ఓ దోశను ఆరగించారు.

ఈ నెల 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ తన సారథ్యంలో కుప్పకూలిపోవడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో హంగు ఆర్భాటాలను వదిలి ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ప్రవర్తిస్తున్నారు.

రాజీనామా చేసిన రోజు సాయంత్రమే…

రాజీనామా చేసిన అదే రోజు సాయంత్రం రాహుల్ సామాన్య పౌరుడిలా పీవీఆర్ చాణక్య మల్టీప్లెక్స్‌ థియేటర్‌కి వెళ్లి ‘ఆర్టికల్ 15’ సినిమా వీక్షించారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాదు, ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ రాహుల్‌ను ఇలా చూడడం హ్యాపీగా ఉంది..’, ‘ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇలా సాధారణ వ్యక్తిలా వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడం గొప్ప పని, ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు..’ అని కొంతమంది నెటిజన్లు పొగుడుతుంటే..

మరికొందరు.. ‘రాహుల్‌ గొప్ప వ్యక్తి’, రాహుల్‌ గాంధీ నిజాయతీ గల నాయకుడు..’ ‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి రాహుల్‌ గాంధీ.. ఇలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకుగాను 52 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

సీడబ్ల్యూసీ నేతలు, పార్టీలోని ఇతర సీనియర్ నేతలు, తన తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంక గాంధీ చెప్పినా కూడా రాహుల్ ససేమిరా అన్నారు. చివరికి వారందరి విజ్ఞప్తి మేరకు.. తాను ఓ నాలుగు నెలలు అధ్యక్ష పదవిలో కొనసాగుతానని.. ఈలోగా పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన ఘంటాపథంగా చెప్పేశారు.

చెప్పినట్లుగానే .. ఇటీవలే అధికారికంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్. ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో తన హోదాను కూడా అధ్యక్షుడికి బదులు.. కార్యకర్తగా మార్చుకున్నారు.

ఇక తాజాగా…

బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ వేసిన ఓ పరువునష్టం కేసు నిమిత్తం బీహార్ రాజధాని అయిన పాట్నాలోని కోర్టుకు శనివారం హాజరైన రాహుల్ గాంధీ.. బెయిల్ పొందిన అనంతరం విమానాశ్రయానికి తిరిగి వెళ్లే సందర్భంలో అక్కడి మౌర్యలోక్ మార్కెట్ కాంప్లెక్స్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి వెళ్లారు.

వెంట ఎలాంటి సెక్యూరిటీ కూడా లేకుండా.. ఓ సాధారణ పౌరుడిలా రెస్టారెంట్‌లోకి రాహుల్ అడుగుపెట్టడంతో అప్పటికే ఆ రెస్టారెంట్‌లో కూర్చుని అల్పాహారం ఆరగిస్తున్న వారు నిశ్చేష్టులయ్యారు. అదేమీ పట్టించుకోని రాహుల్ గాంధీ నేరుగా ఓ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు.

ఆయన వెంట ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోయల్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, రాజ్యసభ సభ్యుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ తదితరులు ఉన్నారు. అనంతరం రాహుల్ గాంధీ అక్కడ ఓ దోశ తిని, కాఫీ తాగి బయటికి వచ్చారు.

ఆ సమయంలో ఆ రెస్టారెంట్‌లో టిఫిన్ చేస్తున్న వారు సడన్‌గా అక్కడ రాహుల్ గాంధీని చూసి షాక్ అయ్యారు. అంతలో తేరుకుని.. ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. వారిలో కొందరు ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదీ వైరల్ అవుతోంది.

ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అమేథీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కేరళలోని వయనాఢ్ నుండి కూడా పోటీ చేశారు. అయితే అమేథీలో ఓటమిపాలైన ఆయన వయనాడ్‌లో మాత్రం విజయం సాధించారు.

తాజాగా.. దక్షిణాదిలో ఖ్యాతిగాంచిన వంటకమైన దోశను ఆరగించడంతోపాటు క్షేత్రస్థాయి ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు నిర్ణయించుకున్నారేమో.. ఓ సాధారణ కార్యకర్తలాగే ప్రవర్తిస్తూ.. యువతలో ముఖ్యంగా నెటిజన్ల మన్నన్నలు పొందుతున్నారు.