బిగ్ బ్రేకింగ్! పేదల ఖాతాల్లోకి ఏటా రూ. 72,000: రాహుల్ గాంధీ ప్రకటన

6:01 pm, Mon, 25 March 19
Rahul Latest News, Rahul Gandhi News, India Political News, Newsxpressonline

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ పథకాన్ని ముందుకు తెచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం(సీడబ్ల్యూసీ) జరిగింది. ఇందులో రాహుల్‌తో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా..

దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. భారత్‌లోని 20 శాతం మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని, అంటే ఐదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలను పొందవచ్చన్నారు వారి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తామని స్పష్టం చేశారు. దీని కోసం అన్ని గణాంకాలను సరి చూసుకున్నామని అని రాహుల్ గాంధీ వివరించారు.

అంతేగాక, ‘ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదు’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.