కరోనాతో పోరాడి మరణించిన ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు

10:30 pm, Sat, 23 May 20

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్రనాథ్ పాండే (78) కోవిడ్ కారణంగా మరణించారు. ఆసుపత్రిలోని పల్మనాలజీ విభాగం డైరెక్టర్, ప్రొఫెసర్ అయిన పాండే గత కొన్ని వారాలుగా కరోనాకు చికిత్స పొందుతున్నారు.

డాక్టర్ పాండే కోవిడ్-19తోనే మృతి చెందినట్టు సీనియర్ వైద్యురాలు డాక్టర్ సంగీతారెడ్డి నిర్ధారించారు. డాక్టర్ పాండే మృతి బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి మెస్ వర్కర్ ఒకరు కరోనాతో మరణించిన తర్వాతి రోజే డాక్టర్ పాండే మృతి చెందడం గమనార్హం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్పీసీ క్యాంటీన్‌ను నెల రోజుల క్రితమే కోరామని, నిరాకరించడం వల్లే మెస్ వర్కర్ కరోనా బారినపడి మృతి చెందాడని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది.

 

ఈ మేరకు ఎయిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాసింది. తమ డిమాండ్లను పెడ చెవిన పెట్టడం వల్ల ఇప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొంది.