విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ… యూకే కోర్టులో అలా, ముంబై హైకోర్టులో ఇలా…

- Advertisement -

vijay-mallya-appeal-petition-dismiss

ముంబై: ఉద్దేశపూర‍్వక రుణ ఎగవేతదారుడు విజయ్‌ మాల్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. లండన్‌‌లోని ఇల్లు తనఖా పెట్టి తీసుకున్నరుణాలను స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్‌ బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలంటూ బుధవారం యూకే కోర్టు మాల్యాకు షాక్‌ ఇవ్వగా.. మరోవైపు ఫ్యుజిటివ్‌ ఆర్థిక నేరస్థుల చట్టం కింద చర్యలపై ఇటు ముంబై హైకోర్టులోనూ ఆయనకు చుక్కెదురైంది.

- Advertisement -

లండన్‌లోని రీజెంట్స్ పార్కు ఎదురుగా ఉన్న తన భవనాన్ని యుబీఎస్‌ బ్యాంక్‌కు తాకట్టుగా పెట్టి 2.04 కోట్ల పౌండ్లు రుణంగా తీసుకుని, రుణ బకాయిలు చెల్లించనందుకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌ నుంచి పారిపోయినప్పటి నుంచి విజయ్ మాల్యా, ఆయన కుటుంబ సభ్యులు ఈ భవనంలోనే నివసిస్తున్నారు. ఈ భవనంలో బంగారంతో చేసిన టాయిలెట్‌ కూడా ఉంది.

స్విట్జర్లాండ్‌ బ్యాక్ యూబీఎస్‌ మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని యూకే కోర్టు బుధవారం మాల్యాను ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికల్లా చెల్లించాలని కోర్టు గడువు కూడా పెట్టింది. ఒకవేళ గడువులోగా ఈ డబ్బును చెల్లించకపోతే.. లండన్‌లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూబీఎస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది.

విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నాయకత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియానికి రూ.9 వేల కోట్ల రుణం ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్‌ పారిపోయాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల జప్తుపై ఎస్‌బీఐ కన్సార్షియానికి అనుకూలంగా యూకే హైకోర్టు ఆదేశాలిచ్చింది. మాల్యాకు దాదాపు రూ.12,500 కోట్ల విలువైనఆస్తులు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు.. ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం 2018 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక‍్టరేట్‌ విచారణను నిలిపివేయాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు గురువారం తోసి పుచ్చింది. కోట్ల రూపాయలను స్వదేశీ బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు చెక్‌ పెట్టాలనే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే ఫ్యుజిటివ్‌ ఆర్థిక నేరగాళ్ళ చట్టం -2018.

ఈ చట్టం ప్రకారం విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈడీ చర్యలను నిలిపివేయాలంటూ విజయ్ మాల్యా పిటిషన్‌ పెట్టుకోగా, ముంబై హైకోర్టు తాజాగా దానిని తిరస్కరించింది.

- Advertisement -