శుభవార్త! ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగులకూ అధిక పెన్షన్…

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ఎందుకంటే ఇకనుంచి ప్రైవేటు ఉద్యోగులు కూడా పదవీ విరమణ సమయంలో అధిక పెన్షన్ తీసుకోవచ్చు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని గతంలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించగా.. దానిని సవాల్ చేస్తూ.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా దానికి చుక్కెదురు అయింది. ఈపీఎఫ్‌వో అప్పీలును సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ప్రైవేటు ఉద్యోగులకు రూ.15,000 ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తోంది. తాజాగా సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ భారీగా పెరగనుంది.

అయితే ఇందులో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. పెన్షన్ అధిక మొత్తంలో వస్తుండటంతో దీని గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు.

ఈపీఎస్ స్కీమ్ ఇలా…

1995లో కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ప్రకారం ప్రతి ప్రైవేట్ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని అతడు పనిచేస్తోన్న కంపెనీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ కంట్రిబ్యూషన్ రూ.6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ అకౌంట్‌కు నెలకు గరిష్టంగా రూ.541 మాత్రమే జమవుతాయి.

మార్పులు ఇలా…

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో రెండు విభాగాలు ఉంటాయి. ఒక‌టి – ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)‌. రెండోది – ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్). ఉద్యోగుల వేతనంలో 12 శాతం మొత్తం ఈపీఎఫ్‌కి జమ అవుతుంది. కంపెనీలు కూడా 12 శాతం మొత్తాన్ని జమచేస్తాయి. ఇందులో 3.67 శాతం ఈపీఎఫ్‌కు వెళ్తుంది. ఇక మిగతా 8.33 శాతం ఈపీఎస్‌కు జమవుతుంది.

1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌కు కొన్ని మార్పులు చేసింది. ఆ తరువాత 2014 సెప్టెంబర్ 1న మళ్లీ ఈపీఎఫ్‌వో ఈపీఎస్ నిబంధనలను సవరించింది. గరిష్టంగా రూ.15,000 ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని తెలిపింది. అంటే నెలకు గరిష్టంగా రూ.1,250 ఈపీఎస్ ఖాతాకు జమవుతాయి.

మెలిక పెట్టిన ఈపీఎఫ్‌వో…

అయితే ఈపీఎఫ్‌వో ఇక్కడో మెలిక పెట్టింది. పూర్తి వేతనంపై పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే.. గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. అంతేకానీ గత ఏడాది కాలపు వేతనం సగటును ప్రాతిపదికగా తీసుకోబోమని పేర్కొంది. దీనిపై కొందరు ఉద్యోగులు కేరళ హైకోర్టు తలుపు తట్టారు.

దీంతో 2014 సెప్టెంబర్ 1న ఈపీఎఫ్‌వో చేసిన మార్పులను కేరళ హైకోర్టు పక్కన పెట్టి.. పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది.

ఈపీఎఫ్‌వోకు సుప్రీంలోనూ చుక్కెదురే…

కానీ కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఈపీఎఫ్‌వో అప్పీలును తిరస్కరిస్తూ.. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది.

- Advertisement -