రేపు కదలనున్న ‘జగన్నాథ రథ చక్రం’.. ఎట్టకేలకు షరతులతో అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

7:17 pm, Mon, 22 June 20
supreme-court-nods-to-puri-jagannath-rath-yatra

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథుడి రధయాత్ర విషయంలో నెలకొన్న ఉత్కంఠకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు తెరదించింది. భక్తులు లేకుండా రధయాత్ర జరుపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

అంతేకాదు, రధయాత్రను కేవలం పూరీలోనే నిర్వహించాలని, ప్రజలెవరూ పాల్గొనరాదని, ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా ఆదేశించింది. 

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్రను నిర్వహించరాదంటూ సుప్రీంకోర్టు జూన్ 18న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇది దేశంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక అని, పన్నెండేళ్లకు ఒక్కసారి వస్తుందని, కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రజల్లేకుండా రథయాత్ర నిర్వహించడానికి అనుమతించాలంటూ కేంద్రం కోరింది.

రథయాత్ర నిర్వహణపై ఇచ్చిన స్టేను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపగా.. కేంద్రం వాదనకు ఒడిశా ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. 

దీంతో ఈ అంశంపై స్పందించిన సుప్రీం.. దీనిపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

దీంతో ఈ ధర్మాసనం ఎదుట కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ వేడుక ప్రజల విశ్వాసానికి సంబంధించినదని కోర్టుకు వివరించారు. 

ఒకవేళ మంగళవారం (జూన్ 23న) ఈ రథయాత్ర నిర్వహించలేకపోతే.. సంప్రదాయం ప్రకారం మరో 12 ఏళ్లపాటు రథయాత్రను వాయిదా వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

రథయాత్ర నిర్వహణలో అనాదిగా భాగం అవుతోన్న కుటుంబాలకు చెందిన 600 మంది సేవలకులు మాత్రమే పాల్గొంటారని తెలిపారు. 

రథయాత్ర విషయంలో అవసరమైన అన్ని చర్యలు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, అవసరమైతే ఒకరోజు కర్ఫ్యూ కూడా విధిస్తుందంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

దీంతో సుప్రీంకోర్టు అంగీకరిస్తూ మంగళవారం నాటి రథ యాత్రకు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సామాన్య ప్రజానీకం రథయాత్రలో పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేసింది.