గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జూన్ 1 నుంచి రైలు సర్వీసులు షురూ…

6:53 am, Wed, 20 May 20
railway

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి దేశం క్రమంగా బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బస్సులు నడిపాలని నిర్ణయించాయి. తెలంగాణలో నిన్ననే బస్సులు రోడ్డెక్కాయి.

ఏపీ సహా మరిన్ని రాష్ట్రాలు కూడా బస్సులు నడిపేందుకు ముందుకొచ్చాయి. తాజాగా, ఇప్పుడు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నాలుగో విడత లాక్‌డౌన్ ముగిసిన వెంటనే రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు శ్రామిక్, ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే.. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు నడపాలని నిర్ణయించింది.

ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్ల ప్రయాణాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆ మధ్యన రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే రైళ్లను నడపడం వలన కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు తెలపడంతో.. జూన్ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఆ డబ్బులు మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.