చైనా నుంచి వచ్చే నిధులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది: కేంద్రమంత్రి రవిశంకర్ సంచలన ఆరోపణ

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి వస్తున్న నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ ట్రస్ట్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి భారీగా నిధులు ముడుతున్నాయని రవిశంకర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీనేతలు చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీకి, చైనాకు మధ్య ఉన్న సంబంధాలను వెంటనే బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు.

భారత్‌, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు అధికార బీజేపీ నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్‌ నేతలు పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)పైనా రవిశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని పదవిని కాపాడుకునేందుకే 1975 జూన్‌ 25న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందని ఆయన ఆరోపించారు. దేశ చరిత్రలో అది చీకటిరోజు అన్నారు.

ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలను ఉత్త పుణ్యానికే అరెస్ట్‌ చేశారన్నారు.

1977 తర్వాత కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో బీహార్‌ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడడం తన అదృష్టమని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.

- Advertisement -