అన్‌లాక్ 4.0: ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన కేంద్రం మార్గదర్శకాలు…

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. 

కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉండనున్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం.. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు తెరవకూడదు.

- Advertisement -

అయితే కంటైన్‌మెంట్ జోన్ల బయట ఉండే స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మాత్రం తల్లిదండ్రుల అనుమతితో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులను స్కూళ్లకు పిలవవచ్చు. అయితే ఇదేం తప్పనిసరేం కాదు. 

ఆన్‌లైన్ విద్య, దూర విద్య కొనసాగవచ్చు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ లాంటివి నిర్వహించుకోవచ్చు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆన్‌లైన్ క్లాసులు, టెలి కౌన్సెలింగ్ వంటివి నిర్వహించేటట్లయితే.. స్కూల్ యాజమాన్యాలు 50 శాతం వరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను పిలుచుకోవచ్చు. 

65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఉపయోగించాలి.

రవాణా సౌకర్యాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అంతర్ రాష్ట్రాల నడుమ వ్యక్తుల ప్రయాణాలు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. 

సినిమా హాళ్లు, ఈత కొలనులు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్ల మూసి వేత కొనసాగుతుంది. సెప్టెంబర్ 21 తరువాత నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు మాత్రం తెరవొచ్చు. 

అలాగే సెప్టెంబర్ 21 తరువాత నుంచి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధిత సభలు నిర్వహించుకోవచ్చు.

మెట్రో రైలు సేవలు సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా ప్రారంభమవుతాయి. అయితే వీటిని రైల్వే, కేంద్ర పట్టణాభివ‌ృద్ధి, హోంశాఖల మార్గదర్శకాల ప్రకారం మాత్రమే నడపాల్సి ఉంటుంది. 

కేంద్ర హోంశాఖ అనుమతించినవి తప్ప ఇతర అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. 

ఇక కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ జోన్లలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించే నిర్ణయాధికారం జిల్లా అధికారులకే ఉంటుంది. ఈ మేరకు కేంద్రం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక సూచన కూడా చేసింది. 

కంటైన్‌మెంట్ జోన్లకు సంబంధించి.. జిల్లాల వెబ్‌సైట్లలో ఆ వివరాలు పొందుపరచాలని, కొత్త కంటైన్‌మెంట్ జోన్లు లేదా కంటైన్‌మెంట్ ఎత్తివేత వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక మీదట కేంద్ర హోంశాఖను సంప్రదించకుండా కంటైన్‌మెంట్‌జోన్ల బయట రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్ విధించడానికి వీల్లేదు. 

 

- Advertisement -