రైడ్ జరగబోతోందని వికాస్‌కు ముందే తెలుసు.. పోలీసు విచారణలో గ్యాంగ్‌స్టర్ అనుచరుడు

- Advertisement -

లక్నో: పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నట్టు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు ముందే తెలుసని పోలీసుల అదుపులో ఉన్న అతడి ప్రధాన అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి పోలీసులకు తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హతమార్చిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అనుచరుడు దయా శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కల్యాణ్ పూర్ లో వికాస్ దూబే గ్యాంగ్ నకు చెందిన వారు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి అక్కడకు వెళ్లారు. దీంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన దయాశంకర్ అగ్నిహోత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

మరోవైపు గురువారం రాత్రి కాన్పూరు లోని బిక్రూ గ్రామంలో వికాస్ దూబే గ్యాంగ్, పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ గురించి దయా శంకర్ అగ్నిహోత్రి మీడియాకు తెలిపాడు. కాల్పుల ఘటనకు ముందు వికాస్‌ను అరెస్ట్ చేయబోతున్నట్లు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు.

దీంతో సుమారు 25 నుంచి 30 మంది అనుచరులను రప్పించాడని, అక్కడికి వచ్చిన పోలీసులపై అతడు కాల్పులు జరిపాడని దయాశంకర్ వివరించాడు. అనంతరం వికాస్ అనుచరులు పోలీసులపైకి కాల్పులు జరుపుతున్నప్పుడు వికాస్ దూబే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, బయట జరుగుతున్న కాల్పులను అతడు చూడలేదని దయాశంకర్ అగ్నిహోత్రి తెలిపాడు.

- Advertisement -