‘‘చేతులెత్తి మొక్కుతాం.. కర్రతో కొట్టకురా.. కాళ్లు కూడా మొక్కుతాం.. కనికరించి వదలరా..’’

4:13 pm, Tue, 5 May 20
viral-video-shows-cop-mercilessly-beating-a-man-as-he-begs-for-mercy-in-ups-etawah

లక్నో: కరోనాపైన ఈ మధ్య సూపర్ పాట ఒకటొచ్చింది. అందరూ వినే ఉంటారు. ‘‘చేతులెత్తి మొక్కుతాం చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతాం అడుగు బయట పెట్టకురా..’’ ఇదీ ఆ పాట పల్లవి.

ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఈ పాట పల్లవే గుర్తుకొస్తుంది కానీ, కొన్ని పదాలే మారతాయి. యూపీలో ఓ యువకుడిపై ఓ పోలీసు జులుం చూస్తుంటే.. ఇలా పాడుకోవాలనిపిస్తోంది.

చదవండి: లాక్‌డౌన్ సడలింపు: రాష్రం దాటేందుకు సిద్ధమైన ప్రజలు.. అడ్డుకున్న అధికారులు, రోడ్లపైనే వేలాది మంది…

‘‘చేతులెత్తి మొక్కుతాం కర్రతో కొట్టకురా.. కాళ్లు కూడా మొక్కుతాం కనికరించి వదలరా..’’. నిజమే! ఏందా కొట్టుడు? పాపం ఆ కుర్రాడు చేతులెత్తి దండం పెడుతున్నా.

కడివెడు మంచి పాలల్లో ఒక్క విషం చుక్క చాలన్నట్లు.. పోలీసులంతా మంచిగున్నా.. ఇట్లాంటోడు ఒక్కడు చాలు డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డ పేరు రావడానికి.

యూపీలోని ఎటావాలో దారుణం…

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ దారుణం. ఓ యువకుడిని ఓ పోలీసు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్‌ ఫోన్‌లో కూడా చిత్రీకరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమాజ్ వాదీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. తనను కొట్టొద్దని ఆ యువకుడు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ ఆ పోలీసు కనికరం చూపెట్టలేదు.

ఆ యువకుడి ఛాతీపై తన బూటు కాలు పెట్టి నొక్కి పట్టి.. చెరుకుగడతోనూ కొడుతూ ఆ పోలీసు కానిస్టేబుల్‌ ప్రవర్తించిన తీరును హృదయం ఉన్న ప్రతి వాళ్లూ ఎండగడుతున్నారు.

ఉన్నతాధికారులు ఏమన్నారంటే…

దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఏం వివరణ ఇచ్చారో చూడండి. ఆ కుర్రాడి పేరు సునీల్‌ యాదవ్ అట. అతడి‌ మానసిక స్థితి బాగోలేదట. తాగుడుకు అలవాటు పడి గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాడట.

గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందుకుని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారని, అయితే అతడ్ని అలా కొట్టడం మాత్రం తప్పేనని, ఈ అపరాధానికి పాల్పడిన పోలీసు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెబుతున్నారు.

చదవండి: రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. ‘జూమ్’ యాప్‌‌కు పోటీగా ‘జియో మీట్’…

అయినా పిచ్చికొట్టుడు కొట్టేసి.. ఆ తరువాత సారీ చెబితే ఏంటి? సస్పెండ్ చేస్తే ఏంటి? నాలుగు రోజులు పోయాక మళ్లీ ఆ కానిస్టేబుల్‌కి ఎక్కడో ఓ చోట పోస్టింగ్ ఇవ్వరా? వాడు మళ్లీ అదే పని చేయడా?

ఇక్కడ మారాల్సింది ఉన్నతాధికారులే. ఇలాంటి దారుణాలకు పాల్పడే పోలీసులను అసలు ఆ శాఖ నుంచే శాశ్వతంగా పీకి పారేయాలి! అప్పుడే అలాంటి ధోరణి కలిగిన మిగిలిన పోలీసులకు కాస్తయినా భయం ఉంటుంది.