ఒక్క ఆదేశం వస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదైపోతుంది: ఆర్మీ చీఫ్ నరవణే

9:34 am, Sun, 12 January 20

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) సహా జమ్ముకశ్మీరు మొత్తం భారతదేశంలో అంతర్భాగమేనని ఆ ప్రాంతం కూడా మనకే చెందాలని ఇప్పుడు పార్లమెంటు కోరుకుని ఆదేశాలు ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే పేర్కొన్నారు.

అంతేకాదు, తాము పీవోకేను సాధించి తీరతామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శనివారం దేశ రాజధానిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆ రెండు సరిహద్దులూ మనకు కీలకం..’’

ఆర్మీపై మోపిన అభియోగాలన్నీ అసత్యమని తేలిపోయిందని, తమకు మద్దతు తెలిపిన జమ్మూకశ్మీర్ ప్రజలు, పోలీసులు, పాలనా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు.

తొలి మహా దళాధిపతిగా నియమితులైన బిపిన్‌ రావత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రక్షణ దళాలను సమీకృతం చేసే దిశగా సీడీఎస్‌, మిలటరీ వ్యవహారాలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చాలా పెద్ద నిర్ణయమన్నారు. దానిని విజయవంతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దులు రెండూ భారత్‌కు కీలకమని నరవణే పేర్కొన్నారు.