కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు పెట్టిన మహిళ ఆత్మహత్య

7:29 pm, Mon, 4 November 19

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్, చెక్ బౌన్స్ కేసు పెట్టిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్‌గా ఉన్న ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే బాబురావ్ చించనసురు 2011లో తాను రూ.11.8కోట్లు ఇచ్చానని, ఆయన ఆ సొమ్మును తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని అంజనా శాంత్ వీర్ (38) అనే మహిళ ఆరోపించింది.

తనకు చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశాడని ఆమె కేసు పెట్టింది. ఆ సమయంలో బాబూరావ్‌కి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. తీవ్ర విమర్శలు చేశారు. అయితే, 2018లో ఆయన బీజేపీలో చేరడంతో ఆ పార్టీ నేతలు సైలెంటైపోయారు. కేసు పెట్టినప్పటినుంచి మంత్రి అనుచరులు నిత్యం అంజనాను వేధిస్తున్నారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కటుంబసభ్యులు ఆరోపించారు.

గత నెల 30 సాయంత్రం అంజనా శాంత్ వీర్ పనిమీద బజారుకి వెళ్లిన తన కొడుకుకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో కంగారుపడిన అతడు వెంటనే ఇంటికి చేరుకున్నాడు. తలుపులు మూసి ఉండడంతో బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతి చెందింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తనను చాలా మంది మోసం చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో అంజనా తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.