అహ్మదాబాద్: మానవులపై ప్రయోగానికి మరో టీకా సిద్ధమైంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జైడస్ కాడిలా త్వరలోనే తాను అభివృద్ధి చేసిన టీకాను మానవులపై ప్రయోగించేందుకు రెడీ అయింది.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా టీకాలు తయారు చేసిన సంస్థల్లో ఇది రెండోది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బయోటెక్ ఓ టీకాను అభివృద్ధి చేస్తోంది.
కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్లో అభివృద్ధి చేస్తున్నట్లు జైడస్ పేర్కొంది. మానవులపై పరీక్షలు నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీఐజీ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి కూడా అనుమతి పొందినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
మార్చిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని ప్రారంభించినట్లు జైడస్ కాడిలా చైర్మన్ పంకజ్ ఆర్. పటేల్ తెలిపారు. తమకు అనుకూల ఫలితాలు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఔషధ ప్రతిరోధకాలు వైరస్‌ను చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.
ఈ టీకాను ఇప్పటికే ఎలుక, పంది, కుందేలుపై పరీక్షించినట్లు వివరించారు. టీకా ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ వైరస్‌ను చంపగలిగాయని ఆయన వెల్లడించారు.