రాజకీయం అంత సులువా…? ప్రజలు పాత్రధారులా..? సూత్రధారులా..?

8:00 am, Sun, 5 May 19

హైదరాబాద్: రాజకీయం అంటే సామాన్య విషయం కాదు. ఓ మామూలు మనిషి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో నిలబడి.. నిలదొక్కుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. కనిపించే యుద్ధాలు ఎన్నికలైతే కనడపని యుద్ధాలు మరెన్నో..

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ నాయకుడు ప్రతి రోజూ యుద్ధం చెయ్యాల్సిందే. అధికారంలో ఉంటే సమర్ధవంతంగా పాలించాలి. ప్రజలు వేలెత్తి చూపకుండా జాగ్రత్త పడాలి. ప్రతిపక్షాలు సంధించే బాణాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి.

ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం చేసే తప్పులని పట్టుకోవాలి. ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలి. మళ్ళీ అధికరంలోకి రావడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చెయ్యాలి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో చూపించినట్టు అందులో మంచీ చెడూ రెండూ ఉండొచ్చు. మంచి మాత్రమే ప్రజలకు చూపించాలి. చెడు చేసినా వాళ్ళ కంట కనపడకుండా కప్పిపుచ్చాలి. ఇదే ఫార్ములా నేటి రాజకీయ నాయకులు ఫాలో అయ్యేది.

మరి ప్రజల ఫార్ములా ఏంటి?

ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజస్వామ్యం మనది. ఒకప్పటి ప్రజలు వేరు.. ఇప్పుడు ప్రజల్లో వచ్చిన చైతన్యం వేరు. రాజకీయ నాయకులకంటే తెలివిగా ఆలోచించగలగడం నేటి ప్రజల చైతన్యం. మరి అలాంటి తెలివైన ప్రజల చేతే ఎన్నుకోబడాలంటే ఇంకెంత తెలివిగా ఆలోచించాలి. ఎంత తెలివిగా ఎత్తులు వేసినా వాటికి పైఎత్తులు వేసే ప్రత్యర్ధులకేం కొదవ లేదు. వీరి ఎత్తులు- పై ఎత్తులు ప్రజల ముందు ఫలిస్తాయా అంటే అది కూడా కష్టమే.

ప్రభుత్వం నుండి అందాల్సినవి అందకుండా.., ప్రజల పరిస్థితి మునుపటి కంటే దుర్భరంగా ఉంటే ఈసారి ఖచ్చితంగా వారికి అవకాశం ఇవ్వకూడదని ఫిక్సవుతారు. ఒకవేళ ప్రభుత్వం ఎక్కువ శాతం మంచి చేస్తే మళ్ళీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ది జరుగుతుందనే నమ్మకం ఉంటే తిరిగి వారికే పట్టం కడతారు.

ఇదేం కాకుండా ప్రతిపక్ష నేత మరింత మంచి చేస్తాడనే ఆలోచన వస్తే ఛాన్స్ ప్రతిపక్షానికే ఇస్తారు. ఇదంతా వాళ్ళ ఆలోచనని బట్టి ఉంటుంది. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళ ఆలోచన అంత సులువుగా మారదు.

ఇం’ధనం’ లేకపోతే నడవదు..

ధనం మూలం ఇదం జగత్.. అని డబ్బు లేకపోతే ప్రపంచమే కాదూ ఎన్నికలూ నడవవు. నాయకులూ గెలవరు. ఇప్పుడున్న రోజుల్లో ఒక్క నాయకుడినైనా డబ్బు లేకుండా గెలవమనండి చూద్దాం.. లేదా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అయినా డబ్బు పంచకుండా పోటీ చేశామని గుండె మీద చెయ్యెసుకుని చెప్పమనండి చూద్దాం.

ఇరు వర్గాలు పోటాపోటీగా డబ్బు పంచినా.. మరే నగదు పంచినా.. చివరికి న్యాయ నిర్ణేతలు మాత్రం ప్రజలే.. రాజకీయనాయకులు ఆడే నాటకీయ రాజకీయంలో ప్రజలు కేవలం పాత్రధారులు అనుకుంటారు.. కానీ, అసలైన సూత్రధారులు ప్రజలే అని తెలిసే సరికి జరగాల్సింది అంతా జరిగిపోతుంది. నాయకులారా.. ఇకనైనా కళ్ళు తెరవండి… ఎన్నికల ముందే కాదు ఎన్నికలయ్యాక మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించండి.

మీరు ప్రజలకి చేసే మంచే మిమ్మల్ని నిలబెడుతుంది. మీకు పట్టం కడుతుంది. ఇక ఈ సారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

చదవండి: ఓ కార్మికుడా… మళ్ళీ యుద్ధం మొదలు పెడదామా…?