దీపావళి స్పెషల్: హరిత టపాసులు వచ్చేశాయ్! శబ్దం వస్తుంది.. పొగ రాదు, కాలుష్యమూ ఉండదు!!

diwali-cracker
- Advertisement -

diwali-crackers

న్యూఢిల్లీ: మన దేశంలో సహజంగానే వాయు కాలుష్యం అధికం. రోడ్లపై వాహనాల నుంచి వెలువడే పొగతోనే నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు మళ్లీ మరింత పొగబెట్టడానికి వచ్చేసింది.. దీపావళి! అవును, దీపావళి వస్తుందంటే చాలు.. పిల్లల నుంచి మొదలు పెద్దల వరకు ఒకటే సంబరం.. అదేనండీ.. టపాసులు కాల్చేయాలనే ఉబలాటం!

- Advertisement -

ఏటా వచ్చే పండుగ.. దీపావళి. అయినా దీపావళి వస్తుందంటే చాలు.. వారం రోజుల ముందునుంచే హడావిడి. ఈసారి ఏం కాల్చాలి.. పోయినసారి కంటే మరింత దఢదఢలాడించాలి.. ఇదే ఆలోచన అందరి మదిలో. కానీ ఈ టపాసుల ద్వారా ఏటా గాల్లో కలుస్తున్న కాలుష్యం గురించి ఆలోచించరా?

అందుకే ఈసారి దీపావళి వస్తుందనగానే సుప్రీంకోర్టు వాత పెట్టేసింది. రోజంతా కాల్చడానికి వీల్లేదంటూ షరతు విధించింది. రోజుకి రెండు గంటలు మాత్రమే టాపాసులు కాల్చుకోవాలి. రోజులో ఎప్పుడు కాల్చుకోవాలన్న చాయిస్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. గ్రీన్ క్రాకర్స్.. అంటే హరిత టపాసులు కాల్చడం భేష్ అంది.

ఏమిటీ ‘గ్రీన్ క్రాకర్స్’?

ఏం లేదండీ.. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే టాపాసులనే ‘గ్రీన్ క్రాకర్స్’(హరిత టపాసులు)గా వ్యవహరిస్తున్నారు. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ ఈ హరిత టపాసుల ఫార్ములాను తయారు చేసింది. చూపులకు ఇవి మామూలు టపాసులలానే ఉంటాయి. అలానే పేలుతాయి కూడా.

కానీ, వీటి నుంచి పొగ, శబ్దం తక్కువగా వెలువడతాయి. సాధారణ టపాసులు నైట్రోజెన్, సల్ఫర్ వాయువులను అధికంగా విడుదల చేస్తాయి. వాటితో పోల్చిచూస్తే.. ఈ హరిత టపాసులు 40-50 శాతం తక్కువ వాయువులను విడుదల చేస్తాయి. వీటి తయారీకి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వాడతారు.

ఎవరు రూపొందించారంటే…

పంజాబ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) శాస్త్రవేత్తలు, దీపావళి నేపథ్యంలో పొగరాని టపాసులను కనిపెట్టారు. ఈ గ్రీన్ టపాకాయల్ని తయారు చేసే విధానాన్ని కనిపెట్టింది ఐఐఎస్ఈఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సామ్రాట్ ఘోష్.

‘‘ ఈ గ్రీన్ క్రాకర్స్ తయారీకి మేం అనుసరించే ప్రక్రియ కూడా పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయదు. చాలాసార్లు తయారు చేసే వస్తువు పర్యావరణహితమైందిగా ఉంటుంది కానీ దాని తయారీలో వెలువడే వ్యర్థాలు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. టపాసులు కాల్చిన తర్వాత వెలువడే ఉద్గారాలు, అందులోంచి విడుదలయ్యే సూక్ష్మ కాలుష్య కారకాలు చాలా తక్కువగా ఉండాలి.. అప్పుడే వాటిని గ్రీన్ కాకర్స్ అంటారు..’’ అని చెబుతారు సామ్రాట్ ఘోష్.

హరిత టపాసుల్లోని రకాలు…

నీరు విడుదల చేసే టపాసులు: వీటిని పేల్చగానే నీటి బుడగలు విడుదలవుతాయి. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్లు అని పిలుస్తారు.

ఆరోమా టపాసులు: వీటిని పేల్చినప్పుడు శబ్దంతో పాటు సువాసనలు కూడా వస్తాయి.

తక్కువ సల్ఫర్, నైట్రోజెన్ విడుదల చేసే టపాసులు: కాలుష్యాన్ని తగ్గించే ఆక్సిడైజింగ్ పదార్థాలు ఈ రకం టపాసుల్లో ఉంటాయి.

అల్యుమినియం వినియోగం తక్కువ: ఈ హరిత టపాసుల తయారీకి 50-60 శాతం తక్కువ అల్యుమినియం వినియోగిస్తారు. వీటిని సేఫ్ మినిమల్ అల్యుమినియం క్రాకర్స్ అని పిలుస్తారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెలుసా?

పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా బాణసంచా తయారీ, అమ్మకాలను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన సుప్రీం… బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు నిరాకరించింది. అయితే, ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మరాదని, లైసెన్స్ ఉన్న వ్యాపారులనే టపాసులు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించాలని సూచించింది.

దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళికి ఏడు రోజుల ముందు, తరువాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించాలి. ఢిల్లీ రాజధాని పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే బాణసంచా కాల్చాలి.

ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు ( 35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. తక్కువ పొగ వచ్చే టపాసుల తయారీకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అలాగే బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రజలకు అవగాహన కూడా కల్పించాలి.

మరి, ఈ గ్రీన్ క్రాకర్స్ ఎక్కడ…?

అతి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే గ్రీన్ క్రాకర్స్ కాన్సెప్ట్‌ను కొనుగొనడమైతే జరిగిందికానీ.. ఇవి ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం మొదట పరీక్షించాకే వీటికి అనుమతిస్తుంది. అందుకే ఈ హరిత టపాసులు విస్తరించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. బహుశా వచ్చే ఏడాది నాటికి ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చు.

ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ గ్రీన్ క్రాకర్స్‌ను వినియోగించరు. ఈ ఆలోచన భారత్‌లోనే పుట్టిందని, ఇవి వినియోగంలోకి వస్తే ప్రపంచంలో ఓ కొత్త మార్పునకు శ్రీకారం చుట్టినట్లేనని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ చీఫ్ సైంటిస్ట్ సాధన చెబుతున్నారు. ‘ఈ టపాసుల విషయంలో మా పరిశోధన పూర్తయింది. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేశాం..’ అని తెలిపారు.

- Advertisement -