ఓ కార్మికుడా… మళ్ళీ యుద్ధం మొదలు పెడదామా…?                  

may day
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఏవైనా నడిచేది కార్మికుడి కష్టం మీదనే. వారు సంపాధించే ధనానికి ఇం’ధనం’ కార్మికుడి చెమట చుక్కే.. అయినా కార్మికుడంటే బానిసే.. అతని కష్టానికి విలువ లేదు.. పెట్టుబడిదారులు, పెత్తందారులు ఏం చెప్తే అది చెయ్యాలి.. ఎన్ని గంటలైనా పని చెయ్యాలి. జీవితంలో సగభాగం పని చెయ్యడానికే సరిపోయేది.

ఫ్యాక్టరీలలో 10 నుండి 12 గంటల పాటు పని చెయ్యడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో ఒక పని చెయ్యడం.. ఒళ్ళు హూనం అయినా వచ్చే కాసులు కష్టాలని తీర్చేవి కావు.. ప్రశాంతమైన నిద్ర ఉండేది కాదు.. బానిస బ్రతుకులు కదా.. సరదాలు, సంతోషాలు లేక ప్రతి కార్మికుడి జీవితం యాంత్రికంగా మారిపోయింది.

లోపల ఎంత బాధ ఉన్నా ఎదురించలేని పరిస్థితి. ఎదిరిస్తే ఎక్కడ ఉన్న పని కూడా పోతుందేమో అన్న భయం.. అయినా క్రోధం, ఉక్రోషం మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉండేవి. ఇది ఒకప్పటి భారతం కాదు.. నేటికీ కొనసాగుతున్న నవయుగ కన్నీటి భారతం..

భరించలేని బాధని ఏ గుండె తట్టుకోలేదు కదా.. ఇక భరించింది చాలు అని అన్నీ గుండెలు ఏకమై ఉప్పెనగా మారి ఉద్యమాలు చెయ్యడానికి నాంది పలికారు అప్పటి కార్మికులు . 8గంటలు పని.. 8 గంటలు వినోదం.. 8 గంటలు విశ్రాంతి.. ఇదే కార్మికుల నినాదంగా మారిపోయింది.

ఎన్నో పోరాటాలు.. ఉద్యమాలు… చివరికి వారు కోరుకున్న విధంగానే 8 గంటలు పని చేసే విధంగా కార్మిక చట్టాన్ని అమలు చేయించారు. మన దేశంలో తొలుతగా 1923 మే 1న కార్మికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. నాటి నుండి ప్రతి సంవత్సరం మే డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ఇంకో నాలుగేళ్ళు అయితే మన దేశంలో మే డే ప్రారంభించి 100ఏళ్ళు పూర్తి అవుతుంది.. కానీ.., ఏం మారింది…? పెరుగుతున్న టెక్నాలజీ, విద్యా రంగంలో జరుగుతున్న మార్పులు, ప్రవేటైజేషన్ అన్నీ కార్మికుల పాలిట శాపంగానే మారుతున్నాయి. ఐ‌టి రంగం అభివృద్ది చెందటంతో అర్ధ రాత్రులు అపరాత్రులు అని తేడా లేకుండా పని చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆడ పిల్లలకు సైతం నైట్ షిఫ్ట్‌ల బాధ తప్పట్లేదు. ఇప్పటికీ కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 8గంటలకే కంటే ఎక్కువ సమయం పని చేసే వారు లేకపోలేదు. ‘కూటి కోసం కోటి తిప్పలు…’ తప్పదు మరి.. ఎదురిస్తే ఉద్యోగం ఉండదు.. గతంలో లాగా ఏకమై ఉద్యమించేవారు లేరు. ఎవరి పని వారిది.. ఎవరి అవసరం వారిది.

ఇక పిల్లల విషయానికి వస్తే 6గంటలే చదువుకి కేటాయించాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నా ప్రైవేటు స్కూళ్లకు అవేం చెవికెక్కట్లేదు. కాసులకే దాసోహం అంటున్నారు తప్ప పిల్లల భవిష్యత్తుపై ఏమాత్రం బెంగ ఉండట్లేదు. స్పెషల్ క్లాసులంటూ ఉదయం నుండి రాత్రి వరకూ పిల్లల మెదళ్ళకు విశ్రాంతి లేకుండా చదివిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాలంటే టీచర్లకు సైతం దాదాపు 10గంటలు పని చెయ్యడం తప్పట్లేదు. ఎంత చదువుకున్నా ఒకరి కింద పని చేస్తే మన హక్కులు వదులుకోవాలి అని సర్దుకుని బ్రతికేస్తున్నారు.

మన అవసరాలతో వ్యాపారాలు చేసే పెత్తందార్లు ఉన్నంత కాలం మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి.. ప్రతి సంవత్సరం మే 1 వచ్చిందని ‘మే డే శుభాకాంక్షలు..’ చెప్పుకుంటే మన జీవితాలలో మార్పులు రావు.. మళ్ళీ ఉద్యమాలు మొదలుపెట్టాలి.. కార్మికుడా మరి యుద్ధానికి సిద్ధమా…??

- Advertisement -