గ్రేట్: రూ.12కే కరోనా వైరస్ టెస్టింగ్ కిట్.. కనుగొన్నది మన మహిళా శాస్త్రవేత్త!

1:05 am, Tue, 31 March 20
the-first-made-in-India-coronavirus-testing-kit-invented-by-woman-viralogist-minal-dakhave-bhosale

న్యూఢిల్లీ: ఓ వ్యక్తిలో కరోనా వైరస్ ఉందో, లేదో తేల్చి చెప్పే టెస్టింగ్ కిట్‌ను తొలిసారిగా దేశీయంగా తయారు చేసిన ఘనత మన దేశానికి చెందిన ఓ మహిళా వైరాలజిస్ట్‌కు దక్కింది. ఆమె పేరు మీనల్ దఖావే భోసలే.

నిండు గర్భిణి అయిన ఈమె తాను ప్రసవించడానికి కొద్ది గంటల ముందు ఈ మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించారు. ‘పాథో డిటెక్ట్’గా పిలువబడుతోన్న ఈ కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. 

ఫ్లూ లక్షణాలు కలిగిన రోగి శరీరంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా.. లేదా అని నిర్ధారించేందుకు ఈ తొలి దేశీయ టెస్టింగ్ కిట్ ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే.. ఈ తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ ఆవిష్కరణతో కరోనా పరీక్ష కేవలం రూ.12తో సాధ్యపడుతుంది.

ఎట్టకేలకు ‘మైల్యాబ్’ సాధించింది…

పూణేలోని ‘మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్’ అనే సంస్థ.. కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను తయారు చేసి.. విక్రయించేందుకు భారత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతి పొందిన తొలి భారతీయ పరిశోధనా సంస్థ. 

ఈ మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ.. హెచ్ఐవీ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి తదితర వ్యాధులను నిర్ధారించే టెస్టింగ్ కిట్లను తయారు చేస్తోంది. 

రూ.12కే వ్యాధి నిర్ధారణ పరీక్ష…

ఇప్పటి వరకు కరోనా వైరస్ టెస్టింగ్ కోసం మన దేశం విదేశాలపైనే ఆధారపడింది. పైగా ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ.4,500. ఈ టెస్టింగ్ కిట్ ధర ఇంత ఖరీదు అవడం వల్లే.. మన దేశంలో ఎక్కువ మందికి కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అయితే ఇప్పుడు మైల్యాబ్ సంస్థ తయారు చేసిన ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ.1200. ఈ టెస్టింగ్ కిట్ 100 నమూనాలను పరీక్షించగలదు. అంటే.. ఈ కిట్ ద్వారా ఇప్పుడు జరిపే వ్యాధి నిర్ధారణ పరీక్షకు రూ.12 అవుతుంది. 

ఇది ఓ మహిళా వైరాలజిస్ట్ విజయం…

మైల్యాబ్ సంస్థ రూపొందించిన తొలి మేడిన్ ఇండియా కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ ‘పాథో డిటెక్ట్’ ఆవిష్కరణ వెనుక ఉన్నది ఆ సంస్థలో పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి, వైరాలజిస్ట్ అయిన మీనల్ ధవే భోసలే.

కోవిడ్-19ను గుర్తించటానికి ఉపయోగించే టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన బృందానికి ఆమె సారథ్యం వహించారు. ఈ కిట్‌ను కేవలం ఆరు వారాల సమయంలోనే తయారుచేయడం విశేషం. 

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ టెస్టింగ్ కిట్ తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన ఆమె తమ బృందం రూపొందించిన టెస్టింగ్ కిట్‌ను విశ్లేషణ కోసం మార్చి 18వ తేదీన దానిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి సమర్పించారు. 

ఆ మర్నాడే.. అంటే మార్చి 19వ తేదీన ఆమె ఆ టెస్టింగ్ కిట్ ప్రతిపాదనను ఇండియన్ ఎఫ్‌డీఏకి, వాణిజ్య అనుమతి కోసం ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీవోకు కూడా సమర్పించారు. 

అప్పటికే మీనల్ ధఖావే భోసలే నిండు గర్భిణి. తమ బృందం రూపొందించిన కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ నమూనాను నియంత్రణ సంస్థల పరిశీలనకు సమర్పించిన గంట సేపటికే ఆమెకు సిజేరియన్ చేయడానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు.

‘‘ఈ ఆవిష్కరణ మాకొక సవాల్..’’

అద్భుతమైన ఈ ఆవిష్కరణ గురించి మీనల్ దఖావే భోసలే మాట్లాడుతూ.. ”నేను దీనిని ఒక సవాలుగా స్వీకరించా. పైగా ఇది ఎంతో అత్యవసర పరిస్థితి. నేను నా దేశానికి చేయగలిగినంత సేవ చేయాలనుకున్నా. మా బ‌ృందంలో పది మంది సభ్యులం.. రేయింబవళ్లు కష్టపడి పనిచేశాం. మొత్తానికి మా ఈ ప్రాజెక్టు విజయవంతం అయింది..” అని చెప్పారు.

తాము రూపొందించిన టెస్టింగ్ కిట్‌ను విశ్లేషణకు పంపించే ముందు.. ఆ టెస్ట్ ఫలితాలు కచ్చితంగా, నిర్దిష్టంగా ఉండాలని భావించామని, దీనికోసం తమ పరిశోధన బృందం కిట్‌కు సంబంధించిన అన్ని ప్రమాణాలను మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. 

‘‘ఒకే నమూనాను పది సార్లు పరీక్షిస్తే.. అన్నిసార్లూ ఒకే రకమైన ఫలితాలు వెలువడాలి. ఇదే అత్యంత కష్టమైనది. అయితే మేం దీనిని సాధించగలిగాం. మా టెస్టింగ్ కిట్ ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంది..’’ అని మీనల్ పేర్కొన్నారు. 

‘‘నో డౌట్, ఇట్స్ ఏ పర్ఫెక్ట్‌ టెస్టింగ్ కిట్..’’

మరోవైపు మైల్యాబ్ సంస్థ రూపొందించిన కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ ‘పాథో డిటెక్ట్’ను పూర్తిస్థాయిలో విశ్లేషించిన భారత ప్రభుత్వ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా ఆ కిట్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తోందని చెప్పింది.

అంతేకాదు, కరోనా వ్యాధి నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్‌ను దేశీయంగా రూపొందించడంలో మైల్యాబ్ సంస్థ నూరు శాతం ఫలితాలు సాధించిందంటూ కితాబునిచ్చింది.

‘‘వారానికి లక్ష టెస్టింగ్ కిట్‌లను అందించగలం…’’

”మేం కాలంతో పోటీపడుతున్నాం. మా ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలి. ప్రతీదీ ఎంతో జాగ్రత్తగా.. మళ్లీ మళ్లీ సవరించాల్సిన అవసరం లేకుండా సక్రమంగా చేయాలి. కరోనా వైరస్ నిర్ధారణకు సంబంధించి దేశీయంగా టెస్టింగ్ కిట్ ఆవిష్కరణలో మా కృషిని మీనల్ దాఖలే భోసలే ముందుండి నడిపించారు..” అంటారు మైల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే.

మరోవైపు మైల్యాబ్ డిస్కవరీ సంస్థ గత వారం 150 టెస్టింగ్ కిట్లను తయారు చేసి పుణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూర్‌లలో ఉన్న డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపించింది.

”మా తయారీ విభాగం నిరంతరం పని చేస్తోంది. సోమవారం మరో బ్యాచ్ టెస్టింగ్ కిట్లను పంపిస్తాం..” అని డాక్టర్ వాంఖడే శుక్రవారం తెలిపారు. తాము వారానికి లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను సరఫరా చేయగలమని, అవసరమైతే 2 లక్షల కిట్‌ల వరకూ ఉత్పత్తిని పెంచగలమని డాక్టర్ వాంఖడే పేర్కొన్నారు.