నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. మీ ఎన్నిక సక్కగుండాలె: నర్సంపేట సభలో కేసీఆర్

- Advertisement -

kcr-narsampet-meeting

వరంగల్: నాయకులు వస్తుంటారు, పోతుంటారని… ప్రజలు మాత్రం సరైన నాయకులను ఎన్నుకోవాలని టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రస్తుతం దేశంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని అన్నారు. రాష్ట్రానికి ఏది మంచిది, ఎవరికి ఓటు వేయాలనేది ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

- Advertisement -

విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. ‘‘58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఏం జరిగినాయో.. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ 24 గంటల కరెంట్‌
లేదు..’’ అని అన్నారు.

రైతుబంధులాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 10 పథకాల్లో రైతు బంధు ఒకటని చెప్పారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు భీమాను వర్తింపజేస్తున్నామని అన్నారు. అసలు కళ్యాణలక్ష్మిలాంటి పథకం వస్తుందని ఎవరూ కనీసం ఊహించలేకపోయారని అన్నారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇస్తున్న పింఛన్లను పెంచుతామని, నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కాబోతున్నాయని తెలిపారు.

నాలుగైదు ఏళ్లలో రైతాంగం ధనవంతులు కావాలని ఆకాంక్షించారు. 58 ఏళ్లలో పోడు భూముల సమస్యలు పరిష్కారం కాలేదని… ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

2 లక్షల 68 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామని చెప్పామని… కట్టి తీరుతామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా బిగించి నీటిని అందిస్తామని అన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ బెటర్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని… ఈ అభివృద్ధిని ఇలాగే ముందుకు తీసుకెళదామని చెప్పారు.
తండాలను గ్రామపంచాయితీలుగా చేశామని, దీంతో గిరిజన సోదరులు గ్రామ సర్పంచ్‌లు కానున్నారని, రిజర్వేషన్లను పెంచాలని కేంద్రంతో కొట్లాతున్నామని, అవి కూడా సాధిస్తామని కేసీఆర్ చెప్పారు.

మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీలు మీముందుకు వస్తున్నాయని… వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని, కాంగ్రెస్‌ నేతల అవినీతిని కక్కిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘నర్సంపేటలో గత ఎన్నికల్లో దయ చూపలేదు. అయినా అన్ని
పథకాలు కొనసాగించాం. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయించాం.

2001 నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పార్టీలో ఉండి కష్టపడుతున్నారు. ఆయనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. ఈసారి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి..’’ అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చదవండి: 17 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తా: కేసీఆర్

చదవండి:  టీఆర్ఎస్ ఓడిపోతే నాకేమీ కాదు, తెలంగాణ ప్రజలకే నష్టం: నిర్మల్ సభలో కేసీఆర్

 

- Advertisement -