స్వామి స్వరూపానందేంద్రతో కేసీఆర్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ!

- Advertisement -

హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌ దైవ సన్నిధానంలో స్వామిని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, స్వరూపనందేంద్ర స్వామి ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. జూన్‌లో నిర్వహించున్న పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి కేసీఆర్‌ను స్వామి ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 18 వరకూ మూడు రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి బాధ్యత స్వీకరణ కార్యక్రమాలు జరగనున్నాయి.

స్వరూపానందేంద్రతో దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, ఆధ్యాత్మిక, రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. సెంటిమెంట్‌లో భాగంగానే కేసీఆర్ స్వరూపానందేంద్రను కలిసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో స్వామీజీని కలిసిన తర్వాతే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చలు మొదలు పెట్టారు. తాజాగా, ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే, అంటే మే 23 కంటే ముందే ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -