హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు భవనాన్ని బుధవారం తాత్కాలికంగా మూసివేశారు. కోర్టులో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.
న్యాయస్థానంలో పని చేసే 50 మందికి మంగళవారం సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడగా 10 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా మూసివేసి శానిటైజేషన్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియల్ అకాడమీకి తరలించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో హైకోర్టు ముందుజాగ్రత్తగా ముఖ్యమైన కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చేపడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా కోర్టులో మరిన్ని పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కేసుల విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు, గురువారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ విచారణను సిటీ సివిల్ కోర్టు భవనంలోకి మార్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ విచారణల్లోనూ కేవలం న్యాయవాదులకే మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు.
క్లర్కులు, జూనియర్లకు లోనికి అనుమతి లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.