కవితకు రైతుల షాక్! వ్యతిరేకంగా 236 మంది పోటీ! అసలేం జరిగిందంటే…

1:26 am, Tue, 26 March 19
nizamabad-mp-kavitha

నిజామాబాద్: సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అక్కడి రైతులు గట్టి షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిత్వానికి కవిత రెండోసారి నామినేషన్ దాఖలు చేయగా, ఆమెపై పోటీగా 236 మంది పోటీకి దిగారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 242 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, వారిలో 236 మంది కవితకు వ్యతిరేకంగా పోటీలో నిలిచిన వారే.

ఎంపీ కవిత తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే ఆమెపై తాము పోటీకి దిగినట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లోని రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలనేది వారి ప్రధాన డిమాండు.

ఈ డిమాండుతో ఫిబ్రవరి నెలలో వారు రాస్తారోకో కూడా నిర్వహించి రోడ్లను దిగ్బంధం చేశారు. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహించారు. ఛలో అసెంబ్లీకి కూడా పిలువునివ్వగా… పోలీసులు వారిని అడ్డుకున్నారు.

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలంటూ కొంతకాలంగా ఎన్ని ఆందోళనలు చేసినా ఎంపీ కవిత పట్టించుకోలేదని, దీంతో తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇంతకన్నా మార్గం తమకు కనిపించలేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ కవితకు వ్యతిరేకంగా బరిలో నిలవాలని నిర్ణయించినట్లు ఆర్మూర్‌కు చెందిన ఓ రైతు చెప్పారు.

కవితపైనే ఎందుకిలా?

గత ఎన్నికల్లో ఎంపీ కవిత నిజామాబాద్ రైతులకు బోలెడు హామీలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని, పసుపుకు రూ.10 వేలు మద్దతు ధర వచ్చేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగడానికి మీ ఊరికి కూడా రానంటూ కవిత సవాల్ చేశారు.

ఈ నేపథ్యంలో ఐదేళ్లు గిర్రున తిరిగాయి కానీ కవిత ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదు. దీంతో అక్కడి రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘మేం రాజకీయ నాయకులం కాదు.. ఉద్యమకారులం.. మాటమీద నిలబడే తత్వం మాది.. ఐదేళ్లు గడిచినా మాకిచ్చిన హామీలు అమలు కాలేదు.. మేం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం.. అయినా ఎంపీ కవిత సరిగా స్పందించలేదు.. అందుకే ఇలా నిరసనకు దిగాం..’’ అని ఓ రైతు పేర్కొన్నారు.

1000 నామినేషన్లు పడాల్సింది కానీ…

నిజానికి ఎంపీ కవితకు వ్యతిరేకంగా.. ఊరికి ఇద్దరు రైతులు చొప్పున మొత్తం వెయ్యి మంది రైతులు నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. కానీ టీఆర్ఎస్ నాయకులు పలువురు రైతులను బెదిరించినట్లు సమాచారం. దీంతో నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుంచి 236 మంది రైతులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

కవిత ఏమంటున్నారంటే…

తనకు వ్యతిరేకంగా రైతులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారనే విషయం తెలియగానే కవిత స్పందించారు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. రైతులు నామినేషన్లు వేయాల్సింది తనకు వ్యతిరేకంగా కాదని, వారణాసిలో మోడీపైన, అమేథీలో రాహుల్ గాంధీపైన వేయాలని వ్యాఖ్యానించారు.

నిజానికి తనపై నామినేషన్లు వేస్తున్నది రైతులు కాదని, ఆ ముసుగులో బీజేపీ, కాంగ్రెస్ నేతలే ఈ పని చేయిస్తున్నారని అన్నారు. నిజంగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశమే ఉంటే రైతులు తన మాట వినాలని.. మోడీ, రాహుల్ గాంధీలపై నామినేషన్లు వేద్దామని ఆమె సూచించారు.