నిజామాబాద్ పోలింగ్‌పై ఉత్కంఠ: బరిలో 185మంది, బ్యాలెట్ పేపర్ విధానమే..

10:12 am, Fri, 29 March 19
443 candidates News, Nizamabad Election News, Newsxpressonline

హైదరాబాద్‌: పోటీ చేసే వారి సంఖ్య వంద దాటడంతో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నిక ఉత్కంఠగా మారింది. అంతేగాక, బ్యాలెట్ పద్ధతితో ఓటింగ్ నిర్వహించనుండటంతో గడువులోగా పోలింగ్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ స్థానానికి మొత్తం 185 మంది పోటీ చేస్తుండటం గమనార్హం.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన, పిరమిడ్‌ పార్టీ, బహుజన్‌ ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ పార్టీలతోపాటు మరో 178 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రైతులు పోటీకి దిగారు. సుమారు 23 ఏళ్ల తరవాత ఇప్పుడే ఒక సమస్యపై పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 1996 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 480 మంది పోటీ చేశారు.

17స్థానాలకు 443 మంది పోటీ..

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో 443 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది. 17 నియోజకవర్గాల్లో 503 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించిన తర్వాత 60 మంది అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 443 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది రంగంలో మిగిలారు.

మెదక్ బరిలో 10మంది, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్ లోక్‌సభా నియోజకవర్గాల్లో అతితక్కువ 11 మంది చొప్పున రంగంలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడంతో ఇక పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఎన్నికల సింబళ్లను కేటాయించామన్నారు.

నిజామాబాద్ పార్లమెంటుకు బ్యాలెట్ విధానమే..

నిజామాబాద్ మినహా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాల ముద్రణ శుక్రవారం ప్రారంభిస్తామన్నారు. నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో బ్యాలెట్ పేపర్‌నే వాడాల్సి ఉంటుందని, ఈవీఎంలను ఉపయోగించేందుకు వీలుకావడం లేదన్నారు. బ్యాలెట్ పేపర్ సైజ్ పెద్దగా ఉంటుందని, బ్యాలెట్ బాక్సులను కూడా ప్రత్యేకంగా తయారు చేయించాల్సి ఉంటుందని, ఇందుకోసం కొంత సమయం పడుతుందన్నారు.

ఈ అంశంపై సవివరమైన నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించామని, కమిషన్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఎన్నికలు వాయిదా వేయాలా లేదా అన్న అంశంపై తాను నిర్ణయం తీసుకోలేనని, కేంద్ర ఎన్నికల కమిషనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

ఈవీఎంలపై బ్యాలెట్ పేపర్‌ను పేస్ట్ చేస్తామని, నియమావళి మేరకే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పేర్లు, సింబల్స్ ముద్రిస్తామన్నారు. ఏడు జాతీయ పార్టీలు, నాలుగు ప్రాంతీయ పార్టీలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత గుర్తింపులేని రాష్ట్ర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, సింబల్స్‌ను బ్యాలెట్ పేపర్లపై ముద్రిస్తామన్నారు. ఫ్రీ సింబల్స్ 198 వరకు ఉంటాయని, గుర్తింపు లేని పార్టీలకోసం 93 సింబల్స్ ఉంటాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్రచారం..

సెల్‌ఫోన్లద్వారా ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అభ్యంతరకరమైన సందేశాలు (ఎస్‌ఎంఎస్) పంపిస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటామని రజత్ కమార్ హెచ్చరించారు. ఇందుకోసం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఈ విభాగం మొబైల్ నెంబర్ 94906 17523కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సోషియల్ మీడియాలో ఎన్నికల ప్రచారం చేసే వారు ముందుగానే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని, ఈ ఖర్చు అభ్యర్థుల ఖర్చులో చేర్చాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయల నగదు, ఐదుకోట్ల రూపాయల విలువైన మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ వెల్లడించారు.