ఫిల్మ్ నగర్ బస్సులో కాల్పులు… నిందితుడిని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్…

8:31 pm, Thu, 2 May 19

హైదరాబాద్: బస్సులో కాల్పులు జరగడంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తిన ఘటన హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… ఉదయం 11గంటల సమయంలో సికిందరాబాద్ నుండి ఫిల్మ్ నగర్ వెళ్తున్న బస్సులో కాల్పులు జరిగాయి.

సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో హఠాత్తుగా కాల్పులు జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. కాల్పులు జరిపిన వ్యక్తి క్షణాల్లోనే పరారయ్యాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతన్ని గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ ఆర్.శ్రీనివాస్ ఈ కాల్పులు జరిపినట్టు నిర్ధారించుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వ్యక్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ బస్సులో ప్రయాణిస్తున్నారు. తోటి ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదం కారణంగానే కాల్పులు జరిపినట్టు ప్రాధమిక విచారణలో తేలింది.

ఆ ప్రయాణికుడిని బెదిరించేందుకు అతను తుపాకీ తీయగా బుల్లెట్ బస్సు పై భాగంలో దిగింది. ఇక శ్రీనివాస్ వెంటనే బస్సు దిగేసి పరారయ్యారు.

అసలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? శ్రీనివాస్ అంతగా ఆవేశపడదానికి కారణం ఏంటి? శ్రీనివాస్‌కి సంభందించిన ఇతర వివరాల గురించి పోలీసులు విచారిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై స్పదించిన ఏపీ డీజీపీ ఠాకూర్ హైదరాబాద్ పోలీసులు తమకు సమాచారం అందించారని తెలిపారు. ఏదేమైనా జనం మధ్య కాల్పులు జరపడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు డీజీపీ తెలిపారు.

చదవండి: కుర్రకుంక ఆయన్ని బపూన్ అంటున్నాడు! కేటీఆర్ పై రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి!