షాకింంగ్: చనిపోయాడని ఏడుస్తుంటే లేచి కూర్చున్నాడు! కానీ, అంతలోనే..

5:44 pm, Sat, 12 January 19
nirmal

నిర్మల్: ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఏడ్పులకు చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరిచి, లేచి కూర్చున్నాడు. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలం దర్యాపూర్ గ్రామానికి చెందిన లింగన్న(49) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి కళ్లు, నోరు తెరవకపోవడంతో చనిపోయాడని నిర్ణయించుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

ఒక్కసారిగా లేచి కూర్చుని..

వేరే దేశంలో ఉన్న అతని కొడుక్కి సమాచారం ఇచ్చారు. కాగా, లింగన్న చుట్టూ చేరిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. ఒక్కసారిగా ఆయన కళ్లు తెరిచాడు. లేచి కూర్చుకున్న లింగన్న.. ఏడుస్తున్న కుటుంబసభ్యులతో బాగానే మాట్లాడాడు.

అయితే సాయంత్రం వరకు బాగానే ఉన్న లింగన్న.. మరోసారి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మళ్లీ లేస్తాడని ఆశగా చూసిన కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలింది. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచిన ఆనందం కొద్ది గంటలు కూడా నిలువకపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.