తహసీల్దార్ విజయారెడ్డిని ఎందుకు చంపానంటే..: వెల్లడించిన సురేశ్

1:28 pm, Tue, 5 November 19

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు సురేశ్.. ఈ అఘత్యానికి పాల్పడడానికి వెనక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఆమెను సజీవ దహనం చేసినట్లు సురేష్ పేర్కొన్నాడు

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. అరవై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న నిందితుడు.. మొదట తనపై కిరోసిన్‌ పోసుకుని, తర్వాత ఆమెపై పోసినట్లు పేర్కొన్నాడు. తాను నిప్పు అంటించుకుని ఆ తర్వాత విజయారెడ్డిని పట్టుకున్నట్లు సరేశ్ తెలిపాడు.

బాచారంలోని 412 ఎకరాల భూమి డెబ్బై ఏళ్లుగా వివాదాల్లో ఉంది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన చేసిన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్‌ యాసిన్‌ వారసులు తెలిపారు. అయితే వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేశ్ కుటుంబం కూడా ఉంది.

ఈ క్రమంలోనే తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని దక్కించుకునేందుకు పథకం పన్నారు. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని అంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే సురేశ్ ఆమెను హత్య చేశాడు. ఈ భూమి విలువ రూ. 40 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.