అమరావతి నిర్మాణం వేస్టని అప్పుడే చెప్పా: కేసీఆర్

6:44 am, Mon, 16 September 19

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దండగని, అదో ‘డెడ్ ఇన్వెస్టిమెంట్’గా మిగిలిపోతుందని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అప్పుడే చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఆదివారం శాసనసభలో ఎత్తిపోతలకు కరెంటు బిల్లులపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఎత్తిపోతలకు కరెంటుపై కొందరు ఎత్తిపొడిచారని గుర్తు చేశారు. జయప్రకాశ్ నారాయణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాని ఆయన ఎత్తిపోతలకు కరెంటు వేస్టన్నాడని విమర్శించారు. పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే మాత్రం ఆహా, ఓహో అంటూ డప్పు కొడతానంటాడని తీవ్ర విమర్శలు చేశారు.

అది డెడ్ ఇన్వెస్టిమెంట్..కట్టొద్దు వేస్టని చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు. దానికంటే  దానికంటే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే బెటరని  చెప్పానని, అయినా ఆయన వినలేదని అన్నారు.

ఇప్పుడేమైందో అందరూ చూస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి జలాలను దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగ‌ర్‌ జలాశయానికి తరలించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

దుమ్ముగూడెం నుంచి టెయిల్‌పాండ్‌కు, అక్కడి నుంచి సాగర్‌కి నీరు వెళ్తుందన్నారు. సాగర్‌ వరకు నీరు వెళ్తే శ్రీశైలం జలాశయానికి వెళ్లినట్లేనన్నారు. సాగర్‌లోకి చేరిన నీళ్లు ఎగువన 100 కిలోమీటర్ల మేర శ్రీశైలం వరకు నిల్వ ఉంటాయని కేసీఆర్ సభలో వివరించారు.