మారుతీరావుకు బెయిల్ మంజూరు! ప్రణయ్ భార్య అమృత స్పందన ఇదీ…

12:51 pm, Sat, 27 April 19
Amrutha Latest News, Maruthi Rao Latest News, Miryalaguda News, Newsxpressonline

మిర్యాలగూడ: గతేడాది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో మారుతీరావు, తన కుమార్తె అమృత భర్తను అతి కిరాతకంగా నడిరోడ్డుపై నరికి చంపించాడు.

ఈ హత్య కేసులో కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆరో నిందితుడైన అతడి సోదరుడు శ్రవణ్‌కుమార్‌, ఐదో నిందితుడు కరీంలపై నిరుడు సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వీరు బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్‌ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. కాగా.. ఇప్పుడు వారికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా.. దీనిపై అమృత తీవ్రంగా స్పందించింది. తన భర్తను చంపిన వారికి ఇప్పటి వరకు శిక్ష విధించలేదని, ఇప్పుడు బెయిల్ కూడా మంజూరు చేశారంటూ తన ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టింది. కాగా.. దీనికి ఓ నెటిజన్ నవ్వుతూ ‘బాగా అయ్యింది’ అంటూ.. కామెంట్ చేసింది.

ఆ నెటిజన్ చేసిన కామెంట్‌పై అమృత మరోసారి స్పందించింది. ‘‘ఈ జనాలు మారరు. నా బాధ వీళ్లకి ఎప్పటికీ అర్థం కాదు..’’ అంటూ తన వేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే.. మారుతీరావు బయటకు వస్తే.. అమృతకు, ఆమె బిడ్డకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందనే వాదన గట్టిగా వినపడుతోంది.

చదవండి:  అమెరికాలో తెలంగాణ యువతి మృతి! అత్తింటి వేధింపులే కారణమా?