నేడు శ్రీరామ నవమి: భద్రాద్రిలో శోభాయమానంగా సీతారాముల కల్యాణం…

2:15 pm, Sun, 14 April 19
bhadradri-sita-rama-kalyanam

భద్రాద్రి: నేడే(ఏప్రిల్ 14) శ్రీరామ నవమి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలిరావడంతో భద్రాద్రి కిటకిటలాడుతోంది.

మరోవైపు కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

ఇక మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని పరిసర ప్రాంతాలను కూడా రంగురంగుల పూలు, ముత్యాల ముగ్గులు, స్వాగత తోరణాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్యను, కస్తూరి నామం, బుగ్గన చుక్క, పూలజడతో వధువు సీతమ్మను కల్యాణ క్రతువుకుసిద్ధం చేశారు.

కన్నుల పండుగగా కల్యాణం…

ఆదివారం ఉదయం 10.30గం. తిరుకల్యాణ మహోత్సవంతో మొదలయ్యే సీతారాముల కల్యాణం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరిగే పెళ్లితో ముగుస్తుంది. సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఈ నెల 6నే వసంతపక్ష బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి.

10న అంకురార్పణ, 11న ధ్వజపట భద్రక మండల లేఖనం, 12న ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట జరిగింది. శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది.

ఆదివారం బాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగదభిరాముడు సీతమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశాడు.

తరలివచ్చిన భక్తజనం…

సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో భద్రాద్రి పులకించిపోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు…

శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా విక్షించేందుకు విచ్చేసే భక్తుల కోసం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు 75 టీవీలు, 5 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 32 సీసీ కెమెరాల ద్వారా భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం 40 కూలర్లు, 36 టన్నుల ఏసీలు, 200 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇక స్టేడియంలోని 24 సెక్టార్లలో 35 వేల మంది భకజనం సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు అవకాశం ఉంది. టికెట్ల ద్వారా 20 వేల మంది, గ్యాలరీ నుంచి 15 వేల మంది ఉచితంగా తిలకించ వచ్చు.

అలాగే భక్తులు బయటికి వెళ్లేందుకు 20 అత్యవసర ద్వారాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కల్యాణానికి విచ్చేసే భక్తులు సేదదీరేందుకు పలుచోట్ల తాత్కాలిక విశ్రాంతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. కల్యాణం రోజున లక్ష తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని కోసం 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

రేపు శ్రీరామ మహా పట్టాభిషేకం…

సీతారాముల కల్యాణం అనంతరం మర్నాడైన సోమవారం నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కూడా మిథిలా స్టేడియంలోనే నిర్వహిస్తారు. వీవీఐపీ దర్శనం కోసం రూ.250, వీఐపీ దర్శనం కోసం రూ.100 చొప్పున టికెట్లు కొనవలసి ఉంటుంది. భక్తుల కోసం 3 లక్షల లడ్డూలను సిద్ధం చేసిన దేవస్థానం అధికారులు 14 కౌంటర్ల ద్వారా వాటిని విక్రయించనున్నారు.