టీఆర్ఎస్‌లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఈసారి కొడంగల్‌లో గులాబీ జెండా ఖాయం: నాయిని

trs-satyanarayana
- Advertisement -

from-bjp-to-trs

హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రులు హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డిల సమక్షంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో  నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ రావు.. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను సాదరంగా ఆహ్వానించగా, నాయిని నర్సింహారెడ్డి పార్టీ కండువా కప్పి  అభినందనలు తెలిపారు.

- Advertisement -

‘‘ఈసారి కొడంగల్‌లో గులాబీ జెండాయే…’’

ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి కొడంగల్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.  రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంపై విమర్శలు గుప్పించే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు ఎంతమాత్రం లేదన్నారు.

అసలు టీఆర్ఎస్‌తో పోటీపడే పార్టీలు తెలంగాణలో లేవని నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరపున ఐదుగురు ఎమ్మెల్యేలు తెలంగాణలో గెలిస్తే ఆ పార్టీకి అదృష్టం దక్కినట్లేనని వ్యంగ్యంగా మాట్లాడారు.

మరో ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సత్యనారాయణ చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్‌ పార్టీ బలోపేతమైందని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని చోట్లా టీఆర్ఎస్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -