ఆసక్తికరం: పార్టీ పరంగా.., నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి: సుహాసిని పోటీపై పురంధేశ్వరి వ్యాఖ్యలు

suhasini-purandeswari
- Advertisement -

nandamuri-suhasini-daggubati-purandeswari

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని గురించి బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా? అని రిపోర్టర్లు అడగ్గా..  ఓ మేనత్తగా తన కోడలికి ఎప్పుడూ తన ఆశీర్వాదం ఉంటుందని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.

- Advertisement -

పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా.. మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురంధేశ్వరి చెప్పారు.  అంతేకాదు, భావసారూప్యత, సిద్ధాంతాలు లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.

మోడీని ఎందుకు గద్దె దింపాలో చెప్పండి…

మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి  ఎన్‌.రాంచందర్‌రావుకు మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు, నరేంద్ర మోడీని గద్దె దింపేందుకు మాత్రమే మహాకూటమి ఏర్పడిందని అన్నారు. మోడీని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ పాలనపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.  ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎ్‌సలకు అవకాశం ఇచ్చిన మల్కాజిగిరి ప్రజలు ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్‌రావు తెలిపారు.

సుహాసినికి జగపతిబాబు మద్దతు…

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నందమూరి సుహాసినికి సినీనటుడు జగపతి బాబు కూడా మద్దతు పలికారు. సుహాసిని నిజాయితీ కలిగిన వ్యక్తి అని, నియోజకవర్గ ప్రజలకు ఆమె నిబద్ధతతో కూడిన సేవ చేస్తారని తాను నమ్ముతున్నానని, కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలని జగపతిబాబు కోరారు.

- Advertisement -